
పీవీ గొప్ప శక్తిమంతుడు
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతి ఇరు రాష్ట్రాల కాంగ్రెస్లను కలిపిందని ఏపీపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లో పీవీ నరసింహరావు 94వ జయంతి వేడుకలు నెక్లెస్ రోడ్డులోని ఆయన సమాధి జ్ఞానభూమి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీకి రఘువీరారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారత ప్రధానిగా పీవీ సేవలను రఘువీరారెడ్డి కొనియాడారు. భారత్ అగ్రగామి దేశంగా ఉందంటే అది పీవీ ఘనతే అని ఆయన తెలిపారు. విభిన్న ఆలోచనలున్న వారిని ఐక్యంగా ఉంచే గొప్ప శక్తిమంతుడు పీవీ అని రఘువీరా అభివర్ణించారు.
భారత ప్రధానిగా పీవీ కాంగ్రెస్యేతర పక్షాలను ఒప్పించి కేంద్రంలో విజయవంతంగా ప్రభుత్వాన్ని నడపగలిగారని గుర్తు చేశారు. బీజేపీలో చెప్పుకోవడానికి గొప్ప నేతలు లేరని ... అందుకే ఆ పార్టీ పీవీ పేరు వాడుకుంటుందని విమర్శించారు. కావాలంటే గాంధీని హత్య చేసిన గాడ్సే పేరు వాడుకోవాలంటూ బీజేపీ నేతలకు రఘువీరారెడ్డి సూచించారు. భవిష్యత్తులో కూడా అనేక అంశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెస్లు కలసి పని చేస్తాయని రఘువీరా స్పష్టం చేశారు.