హైదరాబాద్ : విద్యార్థుల తరఫున ప్రభుత్వంపై పోరాడతామని వారికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి భరోసా ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని ఇందిరాభవన్లో రఘువీరారెడ్డిని ఏపీలో మెడికల్ అడ్మిషన్లు పొందని విద్యార్థులు కలిశారు. ఈ సందర్బంగా రఘువీరారెడ్డితో వారు మాట్లాడుతూ... ఏపీ మెడికల్ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 250 మెడికల్ సీట్లు దక్కకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మెడికల్ సీట్లు 900 పెరిగినా.. తమ న్యాయం జరగలేదన్నారు. మంత్రులకు మెడికల్ కాలేజీలు ఉండటం వల్లే... ఈ పరిస్థితి నెలకొందని వారు... రఘువీరాకు వివరించారు. ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డి పైవిధంగా స్పందించారు. అంతకుముందు ఇందిరాభవన్లో మహాత్మా గాంధీ 147వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రఘువీరారెడ్డి, రాజ్యసభ ఎంపీ కేవీపీతోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.