ఎన్నేళ్లిలా అణిగిమణిగి ఉండాలి?   | Question of Dalits who voted in Chandragiri constituency | Sakshi
Sakshi News home page

ఎన్నేళ్లిలా అణిగిమణిగి ఉండాలి?  

Published Thu, May 23 2019 5:16 AM | Last Updated on Thu, May 23 2019 5:16 AM

Question of Dalits who voted in Chandragiri constituency - Sakshi

30 సంవత్సరాలు తరువాత ఓటు వేసిన ఆనందంలో దళితులు (ఫైల్‌)

‘మా బతుకులు ఎలాగూ తెల్లారిపోతున్నాయి. ఎన్నేళ్లిలా అణిగిమణిగి ఉండాలి? మా పిల్లలు చదువుకుంటున్నారు.. స్వతహాగా ఎదుగుతున్నారు. వారినీ మాలాగే అణగదొక్కేయాలనుకుంటే ఎలా? మాకెలాగూ తప్పలేదు. పెత్తందార్ల అడుగులకు యువత ఎందుకు మడుగులు ఒత్తుతుండాలి? మమ్మల్ని ధైర్యంగా ఉండాలని మా యువకులు చెబుతున్నారు. ప్రభుత్వం రక్షణగా ఉంటే సరేసరి. లేదంటే మమ్మల్ని మేమెలా కాపాడుకోవాలో మేమూ తెలుసుకుంటాం. ఏం మా ఓట్లు మేం వేసుకుంటామని అనడమే తప్పా? అదేమైనా నేరమా? మా హక్కును వినియోగించుకునే అవకాశం కూడా లేదా?’  

‘చూడండయ్యా. మేం రోజుకు కేవలం రూపాయిన్నర కూలికి వాళ్ల పొలాల్లో పనులకు వెళ్లాం. నలభై ఏళ్లుగా మా చెమట ధారపోస్తున్నాం. పిల్లలు చదువుకున్నారు. వారికీ ఆలోచనలు ఉంటాయి. మా ఓట్లు మేం వేసుకుంటామని అడిగితే వాళ్లను కొట్టేస్తారా. వాళ్లు ఉండే ఊరు మాత్రం బాగుండాలి. వాళ్ల వీధులు నున్నగా మారాలి. సిమెంటు రోడ్లు వేసుకోవాలి. మా వీధులు మాత్రం ఇలాగే మట్టి రోడ్లుగానే ఉండిపోవాలా?’ ఇదీ ఎన్‌ఆర్‌ కమ్మపల్లికి చెందిన దళితుడు అరవై ఏళ్ల నడిపయ్య ఆవేదన. 

ఇదీ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌లో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న దళితుల ఆవేదన. 
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు దశాబ్దాల తరబడి అరాచకాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఓటు హక్కు వినియోగించుకుంటామన్న దళితులను భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకపోవడంతో వారంతా ఓటు వేయలేకపోయారు. ఎట్టకేలకు చంద్రగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదుతో తొలిసారి దళితులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ పెద్దలు దళితులపై బెదిరింపులకు దిగారు. ‘ఏరా.. మేం వద్దని చెప్పినా పోలింగ్‌ బూత్‌లకు వచ్చి ఓటేశారు.. ఎన్నికల ఫలితాలు రానివ్వండి.. మీ పని పడతాం’ అంటూ నిరుపేద దళితుల్ని బెదిరిస్తున్నారు. ఈ హూంకరింపులతో దళిత వర్గాల వారు భయకంపితులవుతున్నారు. ఎన్‌ఆర్‌ కమ్మపల్లిలో ఇప్పటికే 20 మంది సొంత ఊరిని వదిలి వేరే ప్రాంతాలకు తరలిపోయారు.    
దళితులపై దాడులకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకునేందుకు పరుగులు తీస్తున్న పోలీసులు (ఫైల్‌) 

వెంకట రామాపురంతో మొదలై.. 
తిరుపతికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోని గ్రామం.. వెంకట రామాపురం. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని ఓ గ్రామమిది. మాజీ మంత్రి, దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడు స్వగ్రామం కూడా ఇదే. టీడీపీ ఆవిర్భావం తర్వాత సొరకాయలపాలెం (ప్రస్తుతం 662 ఓట్లు) పంచాయతీ నుంచి వెంకట రామాపురం (ప్రస్తుతం 377 ఓట్లు)ను విడదీసి ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. సీఎం చంద్రబాబు సామాజికవర్గం ప్రధానంగా పెత్తనం చెలాయిస్తున్న ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, రావిళ్లవారిపల్లి, కమ్మపల్లి, గణేశ్వరపురం (కొత్తకండ్రిగ), కమ్మ కండ్రిగ, కొత్త కండ్రిగ, మిట్ట కండ్రిగ తదితర గ్రామాల్లోని దళిత ఓటర్లు, పేద వర్గాలకు చెందిన వారు స్వయంగా ఓటు వేసే అవకాశం లేదు. ఓటు వేయడం మాట దేవుడెరుగు.. కనీసం ఓటు వేయాలనే ఆలోచన చేసినా దాడులు తప్పేవీ కాదు. 

అరాచకాలు అన్నీఇన్నీ కావు 
తమ అభీష్టానికి, టీడీపీకి వ్యతిరేకంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఆలోచన చేసిన వారికి చుక్కలు చూపించడం రామచంద్రాపురం మండలంలోని పలు గ్రామాల్లోని చంద్రబాబు సామాజికవర్గం నేతలకు చాలా సాదాసీదా విషయం. నడిచే దారులు మూసేయించడం, వాటిపై ముళ్ల కంప (మెష్‌) వేయించడం,  రేషన్‌ సరుకులు తీసుకోనివ్వకపోవడం, పచారీ కొట్లలో సరుకులు కొనుగోలుకు అనుమతించకపోవడం, ఊరి కట్టుబాటు పేరుతో కట్టడి చేయడం వంటి అరాచక చర్యలతో భయకంపితులను చేస్తారు. ఈ దురాగతాల వల్ల ఆ సామాజికవర్గం వారిని ఎదిరించడానికి ఇతర కులాలు, వర్గాల వారు సాహసించరని ఓ సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు. 2014లో సింగిల్‌ విండో ఎన్నికల సమయంలో తాము ఓటు హక్కు వినియోగించుకుంటామని అన్నందుకు దళిత యువకులతోపాటు మరికొందరిని కోళ్లఫారాల్లో వేసి చితకబాదారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పారు.  

వారిపై ఆధారపడుతున్నందునే ఈ దాష్టీకాలు 
గ్రామాల్లోని దళితులు, ఇతర పేదలు రైతుల వద్ద అప్పులు తీసుకుంటుంటారు. వ్యవసాయ పనులకు, ఇతర అవసరాలకూ గ్రామ పెద్దలపైనే ఆధారపడాలి. ఈ కారణంగా చంద్రబాబు సామాజికవర్గం వారిపై పెత్తనం చెలాయిస్తోందని డివిజనల్‌ పోలీస్‌ అధికారి వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘పాతతరం వారు అణిగిమణిగి ఉండేవారు. ఇప్పటి తరం వ్యవసాయ పనులకు వెళ్లటం లేదు. ఏదో ఒక సాంకేతిక నైపుణ్యంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆటోలు తోలుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో పెత్తనం చెలాయిస్తున్న వారిని యువత అంగీకరించడం లేదు. స్వతంత్రంగా వ్యవహరించడానికి ముందుకొస్తున్నారు. దీన్ని అగ్రవర్ణాల వారు భరించలేకపోతున్నారు’ అని వివరించారు. 

ఎన్నిసార్లు విన్నవించినా.. 
తమకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారికి, పోలీస్‌ ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఎన్‌ఆర్‌ కమ్మపల్లికి చెందిన పలువురు దళిత యువకులు ‘సాక్షి’కి చెప్పారు. ‘ఏంట్రా.. మీకు ఓట్లు కావాలా’ అని ఎన్‌ఆర్‌ కమ్మపల్లికి చెందిన చంద్రబాబు సామాజికవర్గం వారు దారికాచి ఐదుగురిని చితకబాదారని వాపోయారు. తక్షణ అవసరాలకు బంగారం కుదువపెట్టి డబ్బు తెచ్చుకుంటే ఆ డబ్బు వైఎస్సార్‌సీపీ వారి వద్ద నుంచి తీసుకున్నారని కొట్టారని కన్నీటి పర్యంతమయ్యారు. ‘చూడండి సార్‌.. మా బాబాయ్‌ ఆటో ఎలా ధ్వంసం చేశారో. ఆయన రోజుకు రూ. 1,000 సంపాదించుకునేవారు.  తెల్లవారుజామున తిరుపతికి వెళ్లి షాపులకు చికెన్‌ వేసేవారు. ఆటో ధ్వంసం చేయడంతో వారం రోజులుగా జీవనోపాధి కోల్పోయారు’ అని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 

తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు ఉండాల్సిందే.. 
తిరుపతికి అత్యంత సమీపంలోని గ్రామాల్లో ఇలాంటి దౌర్జన్యాలను, కుల వివక్షను మేం కూడా అంగీకరించలేకపోతున్నాం. కొందరు అధికారుల తప్పిదాల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోంది. ఓటరు పోలింగ్‌ కేంద్రం లోపలకు రాగానే వారి వేళ్లపై సిరా పూసి స్లిప్పు ఇస్తారట. ఓటు మాత్రం ఎవరో వేస్తారట. సీసీ కెమెరాల పొజిషన్‌ కూడా మార్చేస్తారట. ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటే పోలింగ్‌ అధికారులు ఏం చేస్తున్నట్లు. చివరకు ఇవన్నీ మా విభాగానికి చుట్టుకుంటాయి’ అని రామచంద్రాపురం మండలంలో పోలింగ్‌ను పర్యవేక్షించడానికి అమరావతి నుంచి వచ్చిన సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు ఫోన్‌లో ‘సాక్షి’కి చెప్పారు. అందుకే సంబంధిత పోలింగ్‌ అధికారులపై మరింత కఠిన చర్యలు ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయని తెలిపారు. 

ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌కు మొరపెట్టుకున్నా.. 
ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌ సభ్యులు బ్రాహ్మణ కాలవను సందర్శించినప్పుడు గ్రామస్తులు వారి కాళ్లపై పడి తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ సమయంలో తమ వాళ్లు కూడా అక్కడే ఉన్నారని గంగిరెడ్డిపల్లికు చెందిన వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఏవీ బ్రహ్మానందరెడ్డి గుర్తు చేశారు. కమిషన్‌ సభ్యులు జిల్లా అధికారులతో మాట్లాడారని ఆయన చెప్పారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైనందుకు పాతకందుల వారి పంచాయతీ ఐఏవై కాలనీకి చెందిన దళిత యువకుడికి టీడీపీ నాయకులు రూ.2 వేలు జరిమానా విధించారంటేæఅధికార పార్టీ దాష్టీకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లమవుతోంది. 

అయ్యో... దండం పెడతాం, మీరు గమ్ముగుండండయ్యా.. 
అయ్యా... మీకు దండం పెడతాం. మీరంతా గమ్ముగుండండయ్యా... నోళ్లు మూసుకోండి. ఎదురు మాట్లాడి ఎందుకయ్యా వాళ్ల చేతుల్లో పడి చచ్చిపోతారు.. అని ఎన్‌ఆర్‌ కమ్మపల్లి దళితవాడకు చెందిన మహిళలు ‘సాక్షి’ ప్రతినిధులతో మాట్లాడుతున్న వారిని ఆపడానికి ప్రయత్నించారు. ఆ పొరుగూరోళ్లతో (సాక్షి ప్రతినిధులని వాళ్లకు తెలియదు) మాట్లాడవద్దంటూ వారించారు. ఆ గ్రామంలో పోలీస్‌ పికెట్‌ కొనసాగుతున్నా... పోలీసులు అక్కడే వారి సమీపంలో ఉన్నప్పటికీ దళితుల మాటల్లో వణుకు, కళ్లలో దైన్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ‘ఎందుకమ్మా మీరు అలా భయపడుతున్నారని’ అడగ్గా.. ‘ఏందోనయ్యా, మా ఖర్మ ఇంతే. పిల్లోళ్లు ఓట్లు వేస్తామన్నారట. అంతేనయ్యా దోవలో వస్తున్న వారిని పట్టుకుని కొట్టేశారు. మీరైనా, పోలీసోళ్లు అయినా మాకాడ ఎన్నాళ్లు ఉంటారు. పోలీసోళ్లు ఉన్నన్ని రోజులు మా జోలికి రాకపోవచ్చు. ఆ తరువాత ఏమవుతుందో మాకు తెలుసయ్యా. అందుకే ఏం మాట్లాడవద్దని మా వాళ్లను బతిమలాడుకుంటున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధ మహిళలు.  

పునరావృతం కాకుండా చూడాలి 
ఇకనైనా అధికారులు తప్పులు జరగకుండా చూడాలి. ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యం చెందిందంటూ చంద్రబాబు దేశవ్యాప్తంగా తిరుగుతూ గగ్గోలు పెడుతున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆయన సొంత నియోజకవర్గంలో దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టీకాల గురించి కూడా ఆయనే వెల్లడించాలి.  
– చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే

ఆగడాలు వారికి అలవాటే.. 
దళితులపై ఆగడాలు చేయడం వారికి అలవాటే. జిల్లాలోని చాలాచోట్ల ఓ సామాజికవర్గం వారికి దళితుల పట్ల చిన్నచూపు ఉంది. ఎందుకంటే దళితులు తమ ఆర్థిక అవసరాలకు ఆ సామాజికవర్గంలోని ధనిక రైతులపై ఆధారపడుతుంటారు. పశువులు మేపుకోవాలన్నా, గడ్డి తెచ్చుకోవాలన్నా, కట్టెలు కొట్టుకోవాలన్నా, పొలాల్లో నడవాలన్నా వారికి అనుకూలంగా ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎన్నికల్లో తమకే ఓట్లు వేయాలని ఒత్తిడి తెస్తారు.. బెదిరిస్తారు.. దాడులు చేస్తారు. అయినా సరే నమ్మకం కుదరదు. అందుకని పోలింగ్‌ కేంద్రం వద్దకు కూడా దళితులను రానివ్వరు. ఈ పరిస్థితులు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి.  
– సుబ్రమణ్యం, కేవీపీఎస్, రాష్ట్ర అధ్యక్షులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement