చిలుక జోస్యం కోసం ఖజానా లూటీ! | Chandrababu Is Behind The Lagadapati Survey | Sakshi
Sakshi News home page

చిలుక జోస్యం కోసం ఖజానా లూటీ!

Published Mon, May 20 2019 3:50 AM | Last Updated on Mon, May 20 2019 3:50 AM

Chandrababu Is Behind The Lagadapati Survey - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడే తన గూటి చిలుక లగడపాటి రాజగోపాల్‌కు చెందిన బినామీ కాంట్రాక్టు సంస్థకు రూ.1,240.85 కోట్ల విలువైన పనులు అప్పగించిన చంద్రబాబు, పనిలో పనిగా ఖజానా నుంచి రూ.124 కోట్ల మొబిలైజేషన్‌ అడ్వాన్సు ఇప్పించేశారు. ఆ సొమ్ముతో పోలింగ్‌ పూర్తయిన తర్వాత తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 38 నియోజకవర్గాల్లో లగడపాటి ఫ్లాష్‌ సర్వే చేయించి.. ఆ ఫలితాలనే 175 నియోజకవర్గాలకు వర్తింపజేశారు. తరువాత చంద్రబాబు తన పలుకులనే పెంపుడు చిలుకతో శనివారం వల్లింపజేశారు. తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో రీ పోలింగ్‌ సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేయడానికే చిలుకతో ముందు కూయించి, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. కళ్లెదుట ఓటమి సాక్షాత్కరిస్తున్న వేళ.. ఆదివారం మరో అడుగు ముందుకేసి చిలుకతో అశాస్త్రీయమైన సర్వే లెక్కలను వల్లింపజేసి.. కౌంటింగ్‌ వరకూ టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోశారు. చివరకు టీడీపీ ఓటమికి ఈవీఎంలే కారణమని వక్రీకరించి.. కౌంటింగ్‌ రోజున ఉద్రిక్త పరిస్థితులను సృష్టించే కుట్రలకు చంద్రబాబు పదును పెట్టారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ కుట్రలకు ప్రభుత్వ ఖజానా నుంచే నిధులను దోచిపెట్టడాన్ని రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.  

ఖజానా నుంచే సర్దుబాటు 
ఎన్నికల్లో ప్రజల నాడిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి లగడపాటి రాజగోపాల్‌తో సర్వేలు చేయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వ ఖజానా నుంచే సర్దుబాటు చేయడానికి ప్రణాళిక రచించారు. అందులో భాగంగా హైడ్రలాజికల్‌ క్లియరెన్స్‌ తీసుకోకుండానే చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (సీబీఆర్‌), యోగి వేమన రిజర్వాయర్‌ (వైవీఆర్‌), హంద్రీ–నీవా రెండో దశ ఎత్తిపోతలను మంజూరు చేశారు. ఉజ్జాయింపు అంచనాల ఆధారంగా రూ.1,182.33 కోట్లతో ఈ పనులకు టెండర్లు పిలిచి.. కాంట్రాక్టర్లు కుమ్మక్కయేలా చక్రం తిప్పారు. లగడపాటి బినామీకి చెందిన పవర్‌ మ్యాక్స్‌–ష్యూ (జేవీ) సంస్థకు రూ.1,240.85 కోట్ల విలువైన ఆ పనులు దక్కేలా చేశారు. జాయింట్‌ వెంచర్‌(జేవీ)లో ప్రధాన వాటాదారు అయిన పవర్‌ మ్యాక్స్‌కు సాగునీటి ప్రాజెక్టుల పనులు, ఎత్తిపోతల పనులు చేసిన అనుభవం లేదు.

అందులో భాగస్వామి అయిన ష్యూ సంస్థ కూడా పనులు చేసిన అనుభవంపై ‘ఎక్సీ్పరియన్స్‌’ సర్టిఫికెట్స్‌ను షెడ్యూల్‌కు జత చేయలేదు. దీన్నే ఎత్తిచూపుతూ అక్రమాలు జరిగినట్టు నిర్థారణకు వచ్చిన కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ (సీవోటీ) మార్చి 1న ఆ టెండర్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. కానీ.. చంద్రబాబు ఒత్తిడితో ‘ఎక్సీ్పరియన్స్‌’ సర్టిఫికెట్లను సమర్పించడానికి మార్చి 7 వరకూ లగడపాటి బినామీ సంస్థకు గడువు ఇచ్చారు. మార్చి 7న రెండు దఫాలుగా సీవోటీ సమావేశాలు నిర్వహించినా.. ఎక్ప్సీరియన్స్‌ సర్టిఫికెట్లు సమర్పించడంలో ఆ సంస్థ విఫలమైనట్టు సీవోటీ వర్గాలు వెల్లడించాయి. సీఎం చంద్రబాబు ఒత్తిడి మేరకు ఎక్ప్సీరియన్స్‌ సర్టిఫికెట్లు లేకుండానే సదరు సంస్థకు పనులు కట్టబెడుతూ సీవోటీ టెండర్‌ను ఆమోదించింది.

ఈ పనులను ఆ సంస్థకు అప్పగిస్తూ ఈనెల 8న కాంట్రాక్ట్‌ ఒప్పందం చేసుకున్నట్టుగా ఆగమేఘాలపై పత్రాలు తయారు చేసేలా జలవనరుల శాఖ అధికారులపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చి.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ఆ కాంట్రాక్ట్‌ ఒప్పందం ఆధారంగా అంచనా వ్యయంలో 10 శాతం అంటే రూ.124.08 కోట్లను మొబిలైజేషన్‌ అడ్వాన్సు కింద లగడపాటి బినామీ సంస్థకు చెల్లించేలా చక్రం తిప్పారు. ఈ డబ్బుతోనే ఎన్నికల్లో పలు సర్వేలు నిర్వహించిన లగడపాటి.. వాస్తవాలను చంద్రబాబు చెవిలో వేశారు. ఓటమి ఖాయమని తేలడంతో.. పోలింగ్‌ ముగిసీ ముగియక ముందే ఈవీఎంలపై ఆ నెపాన్ని నెట్టే రీతిలో చంద్రబాబు పల్లవి అందుకున్నారు. కౌంటింగ్‌ వరకు టీడీపీ శ్రేణుల్లో ధైర్యాన్ని నూరిపోసి.. కౌంటింగ్‌ రోజున టీడీపీ ఓటమికి ఈవీఎంలే కారణమనే భావనను బలపరిచేలా చేసి.. ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడానికి లగడపాటితో ఆదివారం అశాస్త్రీయమైన సర్వే ఫలితాల పేరుతో తన పలుకులను పలికించారు. ఇదే అదునుగా తీసుకున్న లగడపాటి బెట్టింగ్‌ రాయుళ్లతో కుమ్మక్కై.. అశాస్త్రీయమైన సర్వే ద్వారా చంద్రబాబు పలుకులను వల్లె వేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement