కరుణ చూపలేరా..?
Published Wed, Dec 4 2013 3:12 AM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM
నెల్లిమర్ల/ విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లాలోని 34 మండలాలతో పాటు నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీకి సంబంధించి ఈ ఏడాది అక్టోబరు వరకూ మొత్తం 2.60 లక్షల సంక్షేమ పింఛన్లను ప్రభుత్వం అందజేస్తోంది. వీటిలో 1.26 లక్షలు వృద్ధాప్య, 72 వేలు వితంతు, 35 వేలు వికలాంగ, 24 వేల వైఎస్సార్ అభయహస్తం పింఛన్లున్నాయి. అయితే గత ఏడాది కాలంగా వివిధరకాల పింఛన్లకోసం అర్హులైనవారు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో పింఛన్లు మంజూరు చేయకపోతే రచ్చబండ కార్యక్రమంలో ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితి వస్తుందని తెలిసి ప్రభుత్వం అక్టోబరు నెలలో 28, 194 పింఛన్లు మంజూరుచేసింది. వీటిలో 10,485 వృద్ధాప్య, 14,972 వితంతు, 2445 వికలాంగ పింఛన్లున్నాయి. మంజూరైన పింఛన్లను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల చేతులమీదుగా పంపిణీ చేస్తే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి లాభిస్తుందని తలచిన ప్రభుత్వం పంపిణీని నవంబరు నెలలో నిర్వహించే రచ్చబండ వరకూ వాయిదావేసింది.
ఇటీవల జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రచ్చబండ సభల్లో లబ్ధిదారులందరికీ పింఛన్లకు సంబంధించిన మంజూరు ప్రతాలను అందజేసింది. ఇదే కార్యక్రమంలో రెండునెలలకు సంబంధించిన పింఛన్ల మొత్తాన్ని డిసెంబరు ఒకటిన అందజేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలు సభల్లో ప్రకటించారు. దీంతో ఈ నెల ఒకటి నుంచి లబ్ధిదారులంతా పింఛన్ల కోసం ఎదరుచూస్తున్నారు. కొంతమంది ఆయా గ్రామాల్లోని పోస్టాఫీసులకు వెళ్లి పింఛను గురించి అడిగితే తమకేమీ తెలియదనే సమాధానం వస్తుండడంతో తెల్లబోతున్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు సైతం తమ వద్ద సమాచారం లేదంటున్నారు. దీంతో అసలు తమకు పింఛన్లు మంజూరయ్యాయా..లేదా అని పలువురు అందోళన చెందుతున్నారు.
అలాగే ప్రస్తుతం పింఛన్ల పంపిణీలో బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తుండడంతో తమకు పింఛన్లు ఎవరు అందజేస్తారో తెలియక అయోమయం చెందుతున్నారు. ఇప్పటికే రెండు నెలలు ఆలస్యమైందని..ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పింఛన్లు అందజేయాలు కోరుతున్నారు. ఈ విషయాన్ని డీఆర్‌డీఏ పీడీ టి.జ్యోతివద్ద న్యూస్‌లైన్ ప్రస్తావించగా పాత పింఛన్లకు సంబంధించిన మొత్తం ఇంకా విడుదల కాలేదన్నారు. ఆ మొత్తంతోనే కొత్త పింఛన్లకు సంబంధించి నగదు విడుదలయ్యే అవకాశముందన్నారు. విడుదలైన వెంటనే పంపిణీ చేస్తామని చెప్పారు.
వృద్ధురాలి పేరు జీనపాటి రాజమ్మ. నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం గ్రామానికి చెందిన ఈమె ఏడాది క్రితం పింఛను కోసం దరఖాస్తు చేసుకోగా అక్టోబరులో వితంతు పింఛను మంజూరు చేశారు. వెంటనే పింఛన్ సొమ్ము ఇవ్వకుండా గతనెలలో నిర్వహించిన రచ్చబండ సభలో రాజమ్మకు మంజూరు పత్రాలు అందజేశారు. అక్టోబరు, నవంబరు నెల లకు సంబంధించిన పింఛను మొత్తాన్ని డిసెంబరులో అందజేస్తామని అధికారు లు చెప్పారు. దీంతో ఆమె ఈ నెల రెండో తేదీన పో స్టాఫీసుకు వెళ్లారు. అయితే పింఛను గురించి తెలియదని అక్కడ చెప్పడంతో తెల్లమొహం వేసుకుని వచ్చేశారు.
వృద్ధులుని పేరు అలమండ వెంకటస్వామి. కొత్తపేట గ్రామానికి చెందిన ఈయనకు కూడా ఈ ఏడాది అక్టోబరులో వృద్ధాప్య పింఛను మంజూరైంది. ఇటీవల గ్రామం లో నిర్వహించిన రచ్చబండలో అధికారులు పింఛను మంజూరు ఉత్తర్వులు అందజేశారు. అయితే పింఛను మాత్రం ఇప్పటిదాకా అందలేదు. దీంతో తనకు ఎవరు, ఎక్కడ పింఛను అందజేస్తారో తెలియక వెంకటస్వామి ఆందోళన చెందుతున్నారు. పోస్టాఫీసుకు వెళితే కొత్తపింఛన్ల గురించి తమ వద్ద సమాచారం లేదనే సమాధానం ఇచ్చారని ఆయన చెబుతున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ నెలకొంది.
Advertisement
Advertisement