ఘనాపాటి.. బూదాటి
ఆది నుంచి రాధాకృష్ణయ్య వివాదాస్పదుడే
నెల్లూరు(క్రైమ్): అక్రమ మద్యం కేసులో ఐఎన్‌టీయూసీ నేత, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్యను శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కొడవలూరు మండలం రామన్నపాళేనికి చెందిన బూదాటి రాధాకృష్ణయ్య కార్మిక నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ ఐఎన్‌టీయూసీ జిల్లా నేతగా ఎదిగాడు. ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నేతలతో తనకున్న పరిచయాలను వినియోగించుకొని గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీలోని ఓ వర్గానికి దగ్గరయ్యాడు. ఆర్టీసీ పాలవకర్గ సభ్యుడిగా సైతం విధులు నిర్వహించాడు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర నేతల అండదండలతో నామినెటెడ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.
ఆది నుంచి వివాదాస్పదుడు
రాధాకృష్ణయ్య ఆది నుంచే వివిదాస్పదుడు. అనేక అవినీతి ఆరోపణలు కూడా మూటగట్టుకున్నాడు. వెంకటాచలంలోని ఎఫ్‌సీఐ గోడౌన్, ఆర్టీసీ, విద్యుత్‌శాఖలో షిఫ్ట్టు ఆపరేటర్లు, వాచ్‌మెన్‌లుగా ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.2 కోట్లు వసూలు చేశాడని కార్మికులు నెలల తరబడి ఆందోళనలు సైతం చేశారు. పలువురు బాధితులు వివిధ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం సంచలనం రేకెత్తించింది. కొందరు కార్మిక నేతలు సైతం ఆయన వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం సైతం అప్పట్లో వ్యక్తం చేశారు. దీంతో ఆయన నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. 2009లో సాఫల్య బేవరేజెస్ అండ్ డిస్టిలరీస్ ప్రైవేటు లిమిటెడ్‌ను స్థాపించాడు.
ఉక్రెయిన్‌లోని ఓ సంస్థతో ఒప్పందం చేసుకొని 10,800 వోడ్కా బాటిళ్లను దిగుమతి చేసుకున్నాడు. వాటిని గాంధీనగర్‌లోని ప్రైవేటు గోడౌన్‌లలో పెట్టాడు. అదే క్రమంలో స్కాట్‌ల్యాండ్‌లోని స్విస్‌కో లిమిటెడ్ సంస్థ నుంచి విస్కీ డీలర్ షిప్ తీసుకుని 1250 కేసులను దిగుమతి చేసుకున్నాడు. వాటిని బాలానగర్‌లోని ప్రభుత్వ గోడౌన్‌లో పెట్టాడు. 2014లో అతని లెసైన్సు పీరియడ్ ముగిసింది. అప్పటి నుంచి అనధికారికంగా మద్యం బాటిళ్లను విక్రయించసాగాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న హైదరాబాద్ ఎక్సైజ్ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి బూదాటి ఇంటితో పాటు గోదాములపై దాడులు చేశారు.
దాడుల్లో 455కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకుని సునీల్‌కుమార్, అభిన వకుమార్, హర్వీందర్‌సింగ్‌తో పాటు బూదాటిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ రూ.1.75కోట్లు, అనధికారికంగా విక్రయించిన మద్యం విలువ రూ.90లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.