
సాక్షి, అమరావతి: ఏసీబీకి చిక్కిన టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ గోళ్ల వెంకట రఘు విషయంలో రోజుకొక ఆసక్తికరమైన విషయం వెల్లడవుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ రఘు, ఆయన బినామీల ఇళ్లపై ఇటీవలే మెరుపుదాడులు నిర్వహించిన ఏసీబీ బృందాలు పలుకీలక పత్రాలు, ఆధారాలు సేకరించిన సంగతి తెల్సిందే. అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చడానికి ముందే రఘును విచారించిన ఏసీబీ అధికారులు ఆయన చెప్పిన మాటలు విని విస్తుపోయినట్టు తెలిసింది. ప్రభుత్వ అధికారిగా తాను అక్రమార్జనకు పాల్పడలేదని, పసుపు సాగుతో ఆదాయాన్ని ఆర్జించానంటూ రఘు చెప్పినట్టు ఏసీబీ అధికారి ఒకరు తెలిపారు. అయితే రఘు, ఆయన బినామీలు వద్ద దొరికిన భారీ మొత్తం బంగారం, వెండి, వజ్రాల నగలు, భవంతులు, స్థలాలు వంటి వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను పసుపు సాగుతోనే సంపాదించారా? అంటూ ఏసీబీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఆధారాల కోసం ఏసీబీ కసరత్తు..
రఘు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడటంతో పాటు ఆయన, ఆయన బినామీలు నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారనడానికి ఆధారాలను ఏసీబీ సేకరిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టిన రఘు కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సంపాదించేందుకు జాయింట్ ఆపరేషన్ కోసం తెలంగాణ ఏసీబీ అధికారులతో ఏపీ ఏసీబీ అధికారులు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో పనిచేసిన రఘు షిర్డీ, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.