ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్పై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్పై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలకు ఆధార్ లింక్ను ఉపసంహరించుకోవాలని ఆయన మంగళవారమిక్కడ డిమాండ్ చేశారు. ఆధార్ అనుసంధానం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును చంద్రబాబు బేఖాతరు చేస్తున్నారా? అని రఘువీరా ప్రశ్నించారు. బాబు పాలనలో సంక్షేమ తలుపులకు మూతలు పడ్డాయని, రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు వంచిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
రూ.87 వేల కోట్లు రుణాలు ఉంటే 7వేల కోట్లు రీషెడ్యూల్ చేస్తారా అని రఘువీరా ప్రశ్నించారు. అనధికారికంగా 13 నుంచి 14 లక్షల పింఛన్లపై కోత విధిస్తున్నట్లు సమాచారం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎవరైనా పింఛన్లు, రేషన్ కార్డులు కోల్పోయినా తమ ఫిర్యాదుల విభాగానికి ఉత్తరం రాయవచ్చని రఘువీరా తెలిపారు. రుణమాఫీ ఖరీఫ్కు అమలు చేస్తారా లేకా రబీకి అనే విషయాన్ని చంద్రబాబు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.