రుణమాఫీ పేరుతో మహిళా సంఘాల ఓట్లతో గద్దెనెక్కి తానలా అనలేదని నాలుక మడతేశారు. వారి ఆగ్రహం పెల్లుబకడంతో మసిబూసి మారేడుకాయ చేసేందుకు యత్నిస్తున్నారు. పెట్టుబడి నిధికింద రూ. పదివేల వంతున ఇస్తామని చెప్పి రకరకాల నిబంధనలు పెట్టారు. తీరా వారు ససేమిరా అనడంతో వాడుకునేందుకు అవకాశం కల్పించి కొందరికే పరిమితం చేశారు. విపక్షనేత డ్వాక్రా రుణమాఫీ చేస్తామని ప్రకటించగానే... ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోవిడత పసుపుకుంకుమ పేరుతో మళ్లీ ఎర వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలినుంచీ బాబు తత్వం తెలిసిన మహిళలు ఈ మాయమాటలు నమ్మలేమని తెగేసి చెబుతున్నారు.
విజయనగరం అర్బన్/నెట్‌వర్క్: అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళ రుణాలు మాఫీ చేస్తామంటూ తెగ ప్రచారం చేసిన తెలుగుదేశం నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే మరచిపోయారు. వారి మాటలు నమ్మి బ్యాంకుకు బకాయిలు చెల్లించని చెల్లెమ్మలు అధికారుల దృష్టిలో డిఫాల్టర్లుగా మిగిలారు. కొందరైతు వడ్డీ తడిసిమోపెడవడంతో బంగారం తాకట్టుపెట్టి అప్పు తీర్చుకుని ఉసూరు మన్నారు. ఆ తరువాత రోజుకో మాటతో... పూటకో కథతో వారిని మాయచేశారు.మొత్తం కాదు.. కేవలం గ్రూపునకు రూ. లక్ష మాత్రమే మాఫీ చేస్తామని ఒకసారి, ఒక్కో సభ్యునికి రూ.10 వేల వంతున హామీ లేని రుణంగా ఇస్తామని మరోసారి... చివరకు పసుపుకుంకుమ కింద దానిని ఉచితంగా ఇస్తున్నానని ఇంకోసారి నమ్మబలికారు. తీరా అదీ కొందరికే ఇచ్చి సరిపెట్టారు.
మాఫీ చేయాల్సిన రుణం రూ.450 కోట్లు
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికా రం చేపట్టేనాటికి రూ. 450 కోట్ల మేర డ్వాక్రా రుణాలున్నాయి. వాటిని మాఫీ చేయాల్సి ఉంది. కానీ దానిని పట్టించుకోని ప్రభుత్వం వడ్డీ మాఫీ అంటూ ఓ కథ చెప్పారు. దానికోసం నిరీక్షించేసరికి తొలి 16 నెలలకు రూ.30 కోట్ల వరకు వడ్డీ భారం మహిళలపై పడింది. అప్పటికే గ్రేడ్–ఏలో ఉన్న 20 వేల మహిళా పొదుపు సంఘాలు అప్పట్లో ఆర్థికభారంతో కొట్టుమిట్టాడాయి. అప్పులు తీర్చుకోవడానికి వారంతా ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. కొన్ని సంఘాలైతే తేరుకోలేకపోయాయి.
తొలివిడత పసుపు కుంకుమపైనా ఆంక్షలు
పసుపుకుంకుమ పేరుతో ఇస్తున్న సొమ్మును కూడా పొదుపు మొత్తంలాగే వాడుకోవాలని ఆదేశాలు ఇవ్వడం డ్వాక్రా మహిళల్లో ఆగ్రహావేశానికి కారణమైంది. ప్రస్తుతానికి మాఫీ చేయలేనవి, ఒకే సారి రూ.10 వేలు పసుపు కుంకుమగా ఇస్తానంటూ బహిరంగ సభల్లో ప్రకటించిన చంద్రబాబు.. లోటు బడ్జెట్ పేరుతో తొలి విడత రూ. 3 వేలు మాత్రమే ఇచ్చి... తర్వాత విడతల వారీగా మిగతా సొమ్మును చెల్లిస్తామని పేర్కొనడంతో వారంతా ఆందోళన చెందారు. అంతేకాకుండా జమ చేసే రూ.3 వేలు కూడా వాడుకోకుండా గ్రూపు మొత్తం మీద వచ్చే సొమ్మునంతా పొదుపులాగే అకౌంట్లలో ఉంచుకొని వడ్డీని మాత్రమే తీసుకోవాలని మెలిక పెట్టడంపై తీవ్రస్థాయిలో మహిళలు మండిపడ్డారు. ఎలాగైతేనేం వారి ఆగ్రహానికి భయపడి విత్‌డ్రా చేసుకునేందుకు అంగీకరించారు.
కొందరికే తొలివిడత పసుపుకుంకుమ
తొలిత విడతగా 2014 మార్చిలోగా నమోదైన సంఘ సభ్యులకు రూ.పదివేలు చెప్పున ప్రభుత్వం అందించింది. అప్పట్లో నమోదైన సంఘాలు 37,450 సంఘాలుంటే వాటిలో 4,09,616 సభ్యులున్నారు. వీరికి మొత్తం రూ.413 కోట్లు అందజేసినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. అందులోనూ కొందరికి మొండిచెయ్యే మిగిలింది. కొందరికి తొలివిడత ఇస్తే మిగిలిన రెండు విడతలకు ఎసరుపెట్టారు. మరికొందరికి తొలివిడత కాదని, రెండో విడతగా ఇచ్చారు. అంతేగాకుండా 2014 ఏప్రిల్ తరువాత 3 వేల సంఘాల సభ్యులు 35,945 మందికి పసుపు కుంకుమ ఇవ్వనే లేదు.
రెండో విడతపైనా అనుమానాలే...
జిల్లాలో ప్రస్తుతం 4.45.571 మంది డ్వాక్రా మహిళలకు పసుపుకుంకుమ పథకం రెండో విడతలో రూ.422.57 కోట్లు కేటాయిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌కు సంబంధించి వరుసగా రూ.2,500, రూ.3,500, రూ.4,000 విలువ చేసే చెక్కులను ముందుగానే అందిజేస్తారని ప్రచారం చేస్తున్నారు. అయితే తొలివిడత అందుకోలేనివారి పరిస్థితేమిటన్నదానిపై అధికారులవద్దా సమాధానం లేకపోవడం విశేషం.
అర్హులైనవారి వివరాలు సేకరిస్తున్నాం
రెండో విడత పసుపుకుంకుమ పథకానికి సంబంధించిన విధి విధానాలను అనుసరించిన సభ్యులకు వర్తింప చేస్తాం. వాటి ఆధారంగా కార్యాచరణ తయారు చేస్తాం. ముందుగా అర్హులైన పొదుపు సంఘాల మహిళలను గుర్తిస్తాం. సంఘం పేరు, బ్యాంకుఖాతా, ఆధార్ వంటివి సేకరిస్తున్నాం.– కె.సుబ్బారావు, పీడీ, డీఆర్‌డీఏ
ఇది ఎన్నికల గిమ్మిక్కే
గతంలో ఇచ్చిన హామీలకే దిక్కు లేదు మరో మూడు నెలల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మళ్లీ మహిళలను ఆకట్టుకొనేందుకు పదివేలు, సెల్ ఫోన్ అంటూ మో సం చేసేందుకు యత్నిస్తున్నారు. ఇది ఎన్నిక ల గిమ్మిక్కేనని మహిళలు ఎప్పుడో గ్రహించా రు. రాబోయే ఎన్నికల్లో మహిళలంతా తమ ఓటుతో బుద్ధి చెప్పేందుక సిద్ధంగా ఉన్నారు.– ఆనిమి ఇందిరాకుమారి, ఎంపీపీ, కురుపాం
Comments
Please login to add a commentAdd a comment