'టీడీపీ ఎన్నికల గుర్తింపు రద్దు చేయాలి'
హైదరాబాద్: ఎన్నికల హామీలు అమలు చేయడంలో టీడీపీ ఘోర వైఫల్యం చెందిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్నికల గుర్తింపును రద్దు చేయాలని వారు మంగళవారం హైదరాబాద్లో ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఏపీ సచివాలయంలో రఘువీరా రెడ్డి మాట్లాడారు. ఎన్నికల సమయంలో టీడీపీ దాదాపు 600 హామీలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. వాటిలో కొన్నింటిని మాత్రమే అమలు చేసిందని చెప్పారు.
మరికొన్ని హామీలపైన అయితే టీడీపీ తాకనైనా తాకలేదని రఘువీరా విమర్శించారు. టీడీపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు పరిచేందుకు ఆ పార్టీపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. అలాగే వాటి కోసం నిత్యం పోరాటం చేస్తున్నామని రఘువీరా స్పష్టం చేశారు.