
గవర్నర్‌కు రఘువీరా లేఖ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి గురువారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నాలుగో విడత ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం.. తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంగా జరిపి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఈ జన్మభూమి కార్యక్రమం మొత్తం ఖర్చును తెలుగుదేశం పార్టీ నుంచి ప్రభుత్వ ఖజానాకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు.
ప్రభుత్వ సొమ్ముతో టీడీపీ సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ అవసరాల కోసం, గ్రామాలను నియంత్రించడానికి ‘జన్మభూమి కమిటీ’లను నియమించిందని గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. రాజ్యాంగస్పూర్తికి వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.