
రాహుల్ సభ సక్సెస్: రఘువీరా
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా భరోసా సభ విజయవంతం అయిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.
విజయవాడ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా భరోసా సభ విజయవంతం అయిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాహుల్ సభ విజయవంతం కావడం రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అద్దం పడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరిందని, ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీల నాయకులను కదిలించగలిగామన్నారు. జనసేన కూడా ప్రత్యేక హోదా భరోసా సభకు మద్దతును ప్రకటించిందని తెలిపారు.
టీడీపీ, బీజేపీ మినహా మిగిలిన ఏ రాజకీయ పార్టీ వచ్చినా కలిసి ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. టీడీపీ నేతలు కాంగ్రెస్ ప్రయత్నాలకు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు సభలకు కూడా తాము ఇలాగే నల్ల జెండాలతో వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్వయంగా ప్రత్యేక హోదా ఫ్లెక్సీలను తొలగించారని. కిరాయి మూకలకు మద్యం తాగించి, సభని భగ్నం చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేశారని ఆరోపించారు. ఆనాడు వైఎస్ ఉచిత కరెంట్ ఇస్తామంటే టీడీపీ నేతలు ఎద్దేవా చేశారని, ఫలితంగా అధికారానికి పదేళ్లు దూరమయ్యారన్నారు. నేడు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే తెలుగుదేశం నేతలు ఎద్దేవా చేస్తున్నారని, మరోసారి ప్రజలకు దూరంకాక తప్పదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా సభ ఫ్లెక్సీలను చించిన ఎమ్మెల్యేలు తమ పదవులకు అర్హులేనా? వీధిరౌడీలను మరిపిస్తున్నారని రఘువీరా రెడ్డి దుయ్యబట్టారు.