
'రాక్షస జాతి మోడీతో రాహుల్ యుద్ధం చేస్తారు'
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని రాక్షస జాతికి చెందిన వ్యక్తిగా అభివర్ణించారు కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో రాక్షస జాతి మోడీతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యుద్ధం చేస్తారని ఆయన తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాను పవిత్రుడులా మాట్లాడుతున్నారని పాల్వాయి ఎద్దేవా చేశారు.ఈ విధంగా బాబు మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. నరరూప రాక్షసుడైన ఆయన పాలనలో ప్రజలు నరకాన్ని చూశారన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకి వెన్నపోటుపొడిచిన విషయాన్ని గుర్తు చేశారు.
సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు భూదందాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన చేసే కాంట్రాక్టల నుంచి కిరణ్ లంచాలు తీసుకుంటున్నారన్నారని విమర్శించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వాటిపై సమీక్షలు నిర్వహిస్తామని పాల్వాయి తెలిపారు. కళంకిత నేతలను, మంత్రులను కాంగ్రెస్ నుంచి పంపాలని ఏఐసీసీలో తాను తీర్మానం ప్రవేశపెడతానన్నారు.