జీవిత కాలం లేటు పట్టాలెక్కితే ఒట్టు
Published Wed, Feb 12 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
సాక్షి, ఏలూరు :ఎందరు ప్రజాప్రతినిధులున్నా.. ఎన్ని బడ్జెట్ సమావేశాలు జరిగినా.. ఏటా జిల్లాకు అన్యాయమే జరుగుతోంది. రైల్వే బడ్జెట్‌పై ఆశలు పెట్టుకోవడం.. చివరకు అవన్నీ అడియాశలు కావడం అలవాటైపోయింది. ప్రధాన ప్రాజెక్టులకు కంటితుడుపుగా కేటాయింపులు చేస్తున్నా.. నిధులు విడుదల కావడం లేదు. రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారంప్రవేశపెట్టనున్న 2014-15 ఓటాన్ అకౌంట్ రైల్వే బడ్జెట్‌లో అరుునా జిల్లాకు మేలు చేకూరుతుందనే ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. పెండిం గ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించటంతో పాటు, కొత్త ప్రాజెక్టులు ప్రకటించాలని కోరుతున్నారు. ఆర్‌ఎంఎస్ (పోస్టల్)కు గతంలో మెయిల్ బోగీని ప్రత్యేకంగా కేటాయించేవారు. దానిని కొన్ని రైళ్లలో తీసేయడంతో జనరల్ బోగీనే మెయిల్ బోగీగా ఉపయోగిస్తున్నారు. దీంతో జనరల్ బోగీలు తగ్గాయి. పండగలు, సెలవు రోజుల్లో ప్రయాణికులు రైళ్లలో వెళ్లాలంటే నర కం చూస్తున్నారు. బోగీల్లోని టాయిలెట్లలో సైతం నిలబడి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల్ని పెంచాలని వేడుకుంటున్నారు.
రాముని చెంతకు చేర్చేదెన్నడో...
జిల్లాలో కొత్త రైల్వేలైన్ల ఏర్పాటుకు హామీలిచ్చినా సర్వేల సరిపెడుతున్నా రు. ఏజెన్సీ, మెట్ట ప్రాంత ప్రజ లను 1964 నుంచి ఊరిస్తున్న కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణానికి నోచుకోవడం లేదు. 155.6 కిలోమీటర్ల మేర 16 స్టేషన్లతో నిర్మించే భద్రాచలం లైన్‌కు 2012-13 బడ్జెట్‌లో రూ.923 కోట్లు కేటాయించారు. 2013-14 బడ్జెట్‌లో రూపాయి కూడా విదల్చలేదు. ఈ లైన్ పూర్తయితే విశాఖ-హైదరాబాద్ మధ్య బొగ్గు, అటవీ ఉత్పత్తుల రవాణా సులభతరం అవుతుంది. రవాణా ఖర్చులు తగ్గుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇన్ని ప్రయోజనాలున్న ఈ లైన్‌ను సాకారం చేసుకోవడంలో మన నాయకులు విఫలమవుతూనే ఉన్నారు.
నరసాపురం-కోటిపల్లికి ఏమిస్తారు
ఉభయగోదావరి జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన నరసాపురం-కోటిపల్లి లైన్‌కు 2012-13 బడ్జెట్‌లో రూ.2 కోట్లు కేటాయించగా, 2013-14 బడ్జెట్‌లో రూ.కోటి మాత్రమే విదిల్చారు. ఈ ప్రాజెక్టును 2001-02 బడ్జెట్‌లో రూ.700 కోట్లతో ప్రతిపాదించారు. ఆ అంచనాలు ఇప్పుడు రూ.1,200 కోట్లకు చేరారుు. ఈ ప్రాజెక్టుకు ఈ సారైనా కేటాయింపులు లేకుంటే పనులు పట్టాలెక్కడం కష్టమే.
హాల్టులైనా ఇవ్వరా
కాకినాడ-వారణాసి మధ్య భీమవరం మీదుగా కొత్త రైలు నడపాలనే డిమాం డ్ ఎంతోకాలంగా ఉంది. భీమవరం మీదుగా అమరావతికి రైలు వేయూలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఏలూరులో కోరమాండల్, గౌహతి, కరియ-యశ్వంత్‌పూర్ వంటి సుమా రు 20 రైళ్లకు హాల్ట్ లేదు. ఇటీవల కొన్ని రైళ్లకు తాడేపల్లిగూడెం స్టేషన్‌లో హాల్ట్ కల్పించారు. కాకినాడ-భావనగర్, విశాఖపట్నం-నిజాముద్దీన్, స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్, దిబ్రూనగర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-కొల్లాం త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కావాలనే డిమాండ్లు ఎప్పటినుంచో ఉన్నాయి. నిడదవోలు జంక్షన్‌లో జన్మభూమి, ప్రశాంతి, లోక్‌మాన్య తిలక్, ఏపీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని కోరుతున్నా పట్టించుకునేవారులేరు. భీమడోలు రైల్వేస్టేషన్‌లో దిగి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల వెళుతుంటారు భక్తు లు. ఈ స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌లు ఆగవు.
లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లకు గతి లేదు
ఏలూరు రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్ (కదిలే మెట్లు) ఏర్పాటు చేయాలని కోరుతున్నా నెరవేరడం లేదు. ఏలూరు పవర్‌పేట రైల్వే గేటు వద్ద ఆర్‌వోబీ లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. తణుకు రైల్వేస్టేషన్‌లో రెండో బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల పది గ్రామాల ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆచంటలో టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అత్తిలిలో పాస్ వే, నరసాపురంలో రెండో ప్లాట్‌ఫారం నిర్మించాల్సి ఉంది. తాడేపల్లిగూడెంలో లిఫ్ట్ ప్రతిపాదన ఉన్నా కార్యాచరణకు నోచుకోలేదు. పాలకొల్లులో ప్లాట్‌ఫారంపై షెల్టర్లు లేవు. నిడదవోలు రైల్వేగేటు స్థానంలో ఆర్‌వోబీ నిర్మాణం కోసం రెండు జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. వీటన్నిటికీ ఈసారి బడ్జెట్‌లో అరుునా సమాధానాలు దొరుకుతాయో లేవో వేచిచూడాల్సిందే.
Advertisement
Advertisement