హైదరాబాద్: సీతాఫల్‌మండి రైల్వేస్టేషన్ నుంచి హైటెక్‌సిటీకి వెళ్లాలా? ఎంఎంటీఎస్ ట్రైన్ ఎప్పుడుస్తుందో ఉన్నచోట నుంచే తెలుసుకోవాలా? ఉందీ దానికో మార్గం. ప్రయాణికుల సెల్‌ఫోన్లలోనే ఇక నుంచి రైళ్లు పరుగెత్తనున్నాయి. ఏ రైలు ఎక్కడుందో, ఏ సమయానికి తమకు కావలసిన స్టేషన్‌కు చేరుకొంటుందో తెలిపే సమాచారం క్షణాల్లో సెల్‌ఫోన్‌లోకి రానుంది. ఒక్క ఎంఎంటీఎస్ రైళ్లే కాకుండా, సికింద్రాబాద్, నాంపల్లి,కాచిగూడ రైల్వేస్టేషన్‌లకు వచ్చే, పోయే రైళ్ల కచ్చితమైన వేళలు ఇక నుంచి సెల్‌ఫోన్‌లలో లభించనున్నాయి.‘హైలైట్స్’ పేరుతో దక్షిణమధ్య రైల్వే రూపొందించిన ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జనరల్ మేనేజర్ పి.కె. శ్రీవాస్తవ ఈ నెల 10 సోమవారం ఆవిష్కరించనున్నారు.
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లలో సమస్త రైల్వే సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసేకొనే ఈ టెక్నాలజీ ఆధారంగా రైళ్ల వాస్తవ సమాచారం ప్రయాణికుడికి తెలిసిపోతుంది. జీపీఎస్, జీపీఆర్‌ఎస్ టెక్నాలజీ ద్వారా ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లు, రైల్వేస్టేషన్‌లలో ఎల్‌ఈడీ బోర్డులపై ప్రదర్శిస్తున్న సమాచారాన్ని ఇక నుంచి నేరుగా ప్రయాణికుల జేబుల్లోని సెల్‌ఫోన్‌లలోకి చేరవేసేందుకు దక్షిణమధ్య రైల్వే రంగం సిద్ధం చేసింది.
బహుళ ప్రయోజనాల ‘హైలైట్స్’...
ఎంఎంటీఎస్ రైళ్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లకు వచ్చే, బయలుదేరే రైళ్లన్నింటినీ జీపీఎస్, జీపీఆర్‌ఎస్ వ్యవస్థల ద్వారా అనుసంధానం చేశారు. ఈ వ్యవస్థల ఆధారంగా ప్రస్తుతం ప్రధాన స్టేషన్‌లతో పాటు, ఎంఎంటీఎస్ రైళ్లలో ఎల్‌ఈడీ బోర్డులను ఏర్పాటు చేసి సమాచారాన్ని ప్రదర్శిస్తున్నారు.
ప్రస్తుతం ఎల్‌ఈడీ బోర్డుల ద్వారా ప్రయాణికులకు అందజేసే సమాచారాన్ని ఇక నుంచి ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లలో చూసుకోవచ్చు. ఇంటి నుంచి స్టేషన్‌కు బయలుదేరడానికి ముందే కచ్చితమైన సమయం తెలుసుకొని రావచ్చు. దీనివల్ల స్టేషన్‌లలో పడిగాపులు కాయాల్సిన బాధలు ఉండబోవు.
రన్నింగ్ రైళ్ల సమాచారమే కాకుండా ఎంఎంటీఎస్ రైళ్ల సాధారణ షెడ్యూళ్లు, టైమ్‌టేబుల్స్, చార్జీలు, పాస్‌లు,ఎంఎంటీఎస్ స్టేషన్‌లు,రూట్లు, ఆ సమీప ప్రాంతాలు, తదితర సమాచారం కూడా సెల్‌ఫోన్‌లో లభిస్తుంది.
ఈ సమాచారమంతా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో లభిస్తుంది.
ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ, అంబులెన్స్, ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్‌లు, క్యాబ్‌లు, తదితర సమాచారం కూడా ప్రయాణికులకు లభిస్తుంది.
ప్రయాణికుడికి కావలసిన మొత్తం సమాచారాన్ని దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది.