
హైదరాబాద్ వద్ద మైక్రోమ్యాక్స్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెల్‌ఫోన్ల విపణిలో ఉన్న మైక్రోమ్యాక్స్ హైదరాబాద్ సమీపంలో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. శుక్రవారం (నేడు) తెలంగాణ పారిశ్రామిక విధానం ఆవిష్కరణ సందర్భంగా సీఎం కె.చంద్రశేఖరరావు సమక్షంలో మైక్రోమ్యాక్స్ తన ప్రణాళికను ప్రకటించనున్నట్టు సమాచారం. ఎంత పెట్టుబడి, ప్లాంటు తయారీ సామర్థ్యం వంటి విషయాలను ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించనుంది. పది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. గార్టనర్ నివేదిక ప్రకారం 2015 జనవరి-మార్చి కాలంలో ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. ఇందులో మైక్రోమ్యాక్స్ 81.58 లక్షల యూనిట్లతో 1.8 శాతం వాటా దక్కించుకుంది. తద్వారా ప్రపంచ టాప్-10 సెల్‌ఫోన్ తయారీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. 2014లో మొత్తం 3.3 కోట్ల యూనిట్లను విక్రయించింది.