
తమ రాష్ట్రాలకు పంపండంటూ వేడుకుంటున్న వలస కూలీలు
సాక్షి, చినగంజాం: రైల్వే పనుల నిమిత్తం పొరుగు రాష్ట్రాల నుంచి చినగంజాం వచ్చి చేరిన పలువురు వలస కార్మికులు తమను స్వస్థలాలకు చేర్చాలంటూ ఆదివారం అధికారులను ఆశ్రయించారు. ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా అంతర్ రాష్ట్ర వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటంతో స్థానికంగా కూలి పనిచేస్తున్న పొరుగు రాష్ట్రాల కూలీలు తమను స్వస్థలాలకు చేర్చాలంటూ అధికారులను కలిసి వేడుకున్నారు.
దక్షిణ మధ్యరైల్వే మూడవ రైల్వే లైన్ నిర్మాణ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 49 మంది పలు కుటుంబాల వారు చినగంజాంలోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో కొంత కాలంగా తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని నివాసముంటున్నారు. వీరిలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన పలు కుటుంబాలు వారు చంటి పిల్లలతో సహా ఉంటున్నారు. గత మార్చిలో కరోనా లాక్‌డౌన్ దృష్ట్యా రైల్వే పనులు పూర్తిగా నిలిచిపోవడంతో కూలీలను ఇక్కడకు తీసుకొని వచ్చిన కాంట్రాక్టర్ వారిని ఇక్కడే వదలి వెళ్లిపోయాడు.
గడచిన 40 రోజులుగా తహసీల్దార్ కేవీఆర్‌వీ ప్రసాదరావు వారిని గుర్తించి సాయమందిస్తూ ఆదుకుంటుండగా, స్థానికులు, దాతలు వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అందజేస్తూ వచ్చారు. తహసీల్దార్, ఎస్‌ఐ పి.అంకమ్మరావు సుమారు 49 మంది కూలీలు స్థానికంగా స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment