కలెక్టర్‌గారూ!ఈ తేడాలేమిటి? | Rajahmundry Airport Land Acquisition to farmers Came the fore | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌గారూ!ఈ తేడాలేమిటి?

Published Mon, Feb 2 2015 3:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

కలెక్టర్‌గారూ!ఈ తేడాలేమిటి? - Sakshi

కలెక్టర్‌గారూ!ఈ తేడాలేమిటి?

సాక్షి, రాజమండ్రి :దాదాపు ఐదేళ్లుగా నలుగుతున్న రాజమండ్రి విమానాశ్రయ భూ సేరకణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. పుష్కరాల నాటికి విమానాశ్రయ విస్తరణ పూర్తి చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆదివారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మధురపూడి, బూరుగుపూడి రైతులతో సమావేశమయ్యారు.  భూసేకరణ విషయంలో ప్రభుత్వం తమకు నష్టం కలిగేలా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  మధురపూడి, బూరుగుపూడి పక్కపక్కనే ఉన్నా మధురపూడిలో  ఎకరం ధర రూ.31 లక్షలని అంచనా వేసిన అధికారులు, బూరుగుపూడికి వచ్చేసరికి రూ.17 లక్షలు మాత్రమే విలువ కట్టడమేమిటని నిలదీశారు. వాస్తవానికి ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎకరం విలువ రూ.కోటిన్నర దాటగా లెక్కకట్టిన పరిహారంలోనూ ఇంత తేడాలమిటని ప్రశ్నించారు. మార్కెట్ రేటు చెల్లించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
 
 వారంలో మరో సమావేశం..
 జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ రెండు గ్రామాల్లో పర్యటించి వారంలో మరోసారి రైతులతో సమావేశం అవుతారని కలెక్టర్ వివరించారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు మేలు జరుగుతుందని. రైతుల పంటల ఫలసాయాలకు కూడా పూర్తిగా నష్ట పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు. పుష్కరాల నాటికి విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ సదుపాయం, రన్‌వే కూడా విస్తరణ చేయాల్సి ఉందన్నారు. విమానాశ్రయ అధికారులు కోరిన 840 ఎకరాల సేకరణకు రైతులు సహకరించాలని కోరారు. సమావేశంలో భాగంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విమానాశ్రయం డెరైక్టర్ ధనుంజయ, రెవెన్యూ, సర్వే అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సేకరించే భూములు, వాటి సర్వే నెంబర్లు, విమానాశ్రయం నుంచి రాజమండ్రి వరకూ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించడం తదితర అంశాలపై చర్చించారు.
 
 సర్కారు ధరకు భూములివ్వం..
 విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న భూములు ప్రస్తుతం ఎకరం రూ.కోటిన్నర పలుకుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం మధురపూడి భూములకు రూ.31 లక్షలు, బూరుగుపూడి గ్రామంలోని భూములకు రూ.17 లక్షల రేటు కట్టడం దారుణం. ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం మా భూములకు విలువ నిర్ణయించి చెల్లిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధం.
 - కంటే సత్తిబాబు, బూరుగుపూడి మాజీ సర్పంచ్
 
 ఎనిమిదేళ్లుగా రాబడి లేదు..
 గత ఎనిమిదేళ్లుగా భూమిపై ఆదాయం రావడం లేదు. భూములు స్వాధీనం చేసుకుంటామంటున్నా న్యాయమైన రేటు చెల్లించడం లేదు. మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ చెల్లిస్తున్నారు. పొలంలో ఉన్న చెట్లకు ఎంత చెల్లిస్తారో తెలియదు. ఎయిర్ పోర్టు విస్తరణకు తీసుకున్న భూములకు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం చెల్లించాలి. లేకుంటే స్వాధీనం చేయం
 - సూర్యనారాయణ, రైతు, బూరుగుపూడి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement