రాజంపేట ఎంఈఓకు దేహశుద్ధి
రాజంపేట రూరల్: రాజంపేట ఎంఈఓ కృష్ణకుమార్‌కు బోయనపల్లె గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ‘పిల్లలపై లైంగిక వేధింపులు సర్వసాధారణమే అని ఎంఈఓ పేర్కొనడంతో గ్రామస్తులు ఆగ్రహించారు. ఎంఈఓపై దాడి చేసి చితకబాదారు. బోయనపల్లె జెడ్పీ హైస్కూల్ వద్ద శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థినుల పట్ల ఆర్థర్ అనే ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని గ్రామస్తులు ఆందోళన చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇదే పాఠశాలలో మరో ముగ్గురు ఉపాధ్యాయులు కూడా విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ శనివారం పాఠశాలకు తాళాలు వేశారు. అక్కడున్న సిబ్బందిని, ఉపాధ్యాయులను బయటికి పంపించేశారు. ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, జీఆర్‌ఎస్‌ఎఫ్ విద్యార్థి నాయకులు గ్రామస్తులతో కలిసి పాఠశాల గేటు వద్ద ధర్నా చేశారు.
కీచక ఉపాధ్యాయులైన హెచ్‌ఎం వెంకటరామిరెడ్డి, హిందీ పండిట్ ఖాజాహుస్సేన్, గణిత ఉపాధ్యాయుడు రమణారెడ్డి ఇకపై పాఠశాలకు రావద్దని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ కృష్ణకుమార్ పాఠశాల వద్దకు చేరుకున్నారు. జరిగిన సంఘటనను ఎంఈఓ కృష్ణకుమార్ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. ఇవన్నీ సర్వసాధారణమేనని ఎంఈఓ చెప్పగానే గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎంఈఓపై దాడి చేసి చితకబాదారు. దీంతో విద్యార్థి నాయకులు రక్షణగా ఏర్పడి ఎంఈఓను ద్విచక్ర వాహనంలో తరలించారు. సమాచారం తెలియడంతో రాజంపేట రూరల్ సీఐ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
తొలి నుంచి వివాదాస్పదుడే
బద్వేలుకు చెందిన ఆర్థర్ తొలినుంచి వివాదాస్పద వ్యక్తిగానే పేరుపొందారు. రెండేళ్ల క్రితం రాజంపేట మండలంలోని బోయనపల్లె జెడ్పీ హైస్కూల్‌కు బదిలీ అయ్యారు. చక్రధరకాలనీలో నివాసం ఉండగా ఇతని వికృత చేష్టలు గమనించి ఆరు నెలల క్రితం గ్రామస్తులు అక్కడి నుంచి పంపించేశారు. తరువాత బోయనపల్లెలో నివాసం ఉంటున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు బద్వేలులో ఉన్నారు.
కీచక మాస్టర్ సస్పెన్షన్
వైవీయూ : రాజంపేట మండలం బోయనపల్లె జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న పి. ఆర్తర్‌ను విధుల నుంచి తొలగించినట్లు డీఈఓ కె. అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు.