
మ్యాప్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్, అధికారులు
జిల్లాలో ట్రిపుల్ ఐటీ కళాశాల ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై చర్చించేందుకు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ చాన్సలర్ కేసీ రెడ్డి శుక్రవారం కలెక్టర్ పోలా భాస్కర్‌తో సమావేశమయ్యారు. వారిరువురూ కలిసి పామూరు మండలం దూబగుంట, ఒంగోలు మండలం యర్రజర్లలో స్థలాలను పరిశీలించారు. వేలాది మంది విద్యార్థులకు వసతులు సమకూర్చేందుకు ఆ ప్రాంతం అనువుగా ఉంటుందా.. అక్కడి నీటి లభ్యత ఎలా ఉంటుందనే అంశాలపై ఆరా తీశారు.
సాక్షి, దూబగుంట్ల (పామూరు): మండలంలోని దూబగుంట్లకు మంజూరైన ట్రిపుల్ ఐటీ కళాశాల స్థలాన్ని శుక్రవారం కలెక్టర్ పోలా భాస్కర్, ఆర్‌జీయూకేటీ చాన్సెలర్, ప్రొఫెసర్ కె.చెంచిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా దూబగుంట్ల వద్ద కళాశాలకు కేటాయించిన 208.45 ఎకరాల స్థలంకు సంబంధించిన వివరాలను కందుకూరు ఆర్డీఓ రామారావును అడిగి తెలుసుకుని మ్యాప్‌ను పరిశీలించారు. నీటి వసతి గురించి దూబగుంట్ల గ్రామస్తులతో మాట్లాడగా నీటి వసతి ఉందని కళాశాలకు కేటాయించిన స్థలానికి సమీపంలోనే బత్తాయి తోటలు సాగుచేస్తున్నామని వారు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి సంబంధించి మౌలిక వసతులు, నీటి వసతి, మొదలైన విషయాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
1000 మంది విద్యార్థులు
ఈవిద్యాసంవత్సరంతో కలిపి ప్రస్తుతం మొత్తం 4 వేల మంది విద్యార్థులు కళాశాలలో ఉంటారని తాత్కాలికంగా వీరికి క్లాసులు నిర్వహించేందుకు ఒంగోలు రావు అండ్ నాయుడు కళాశాలలో వసతిని పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నూతనంగా కళాశాల ఏర్పాటు చేస్తే 1000 మంది విద్యార్థులకు గాను రోజుకు కనీసం 70 వేల లీటర్ల నీరు అవసరమవుతుందన్నారు. ఇంతనీటి వసతి ఇక్కడ ఉందా అని ఆర్డీఓను అడిగారు. అదేవిధంగా బోర్లు వేస్తే ఎంతలోతులో నీరు పడతాయని అధికారులను అడగ్గా 100 అడుగులు కావాలని..అయితే నీటిలో ఫోరైడ్ కూడా ఉందన్నారు. ఈ సందర్భంలో కొంతమంది గ్రామస్తులు కలుగజేసుకుని తమకు వెలిగొండ కాలువ సమీపంలో నెల్లూరు జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లె రిజర్వాయర్‌కు వెళ్తుందని, దాని నుంచి పైప్‌లైన్ వచ్చే అవకాశముందని కలెక్టర్ దృష్టికితెచ్చారు. దీంతో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ మరో ఏడాది పడుతుందని, రెండో టన్నెల్ కేవలం 40 మీటర్లే పూర్తయిందని రానున్న జనవరిలో పనులు ప్రారంభించినా కనీసం 2 లేదా 3 సంవత్సరాలు పడుతుందన్నారు. అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తయినా శ్రీశైలం ప్రాజెక్టులో నీరు 854 అడుగులు దాటితేనే అప్పటి పరిస్థితులను బట్టి ప్రాధాన్యాతా క్రమంలో మొదట తాగునీరు, ఆతరువాత సాగునీటికి ప్రాధాన్యం ఇస్తారని దీనికి కొంత సమయం పడుతుందని వివరించారు.
అప్పటిదాకా వర్షాధారంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయినా ప్రతిపాదిత ట్రిపుల్ ఐటీ కళాశాలకు నీటి వసతిపై ఇరిగేషన్ అధికారులతో చర్చింది నివేదికను ప్రభుత్వానికి పంపుతామని తెలిపిన ఆయన సీఈతో ఫోన్‌లో మాట్లాడారు. దూబగుంట్ల వద్ద ప్రతిపాదిత ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రాంతానికి నీటివసతిపై వివరాలు అడిగారు. ఈసందర్భంగా గ్రామస్తులు ట్రిపుల్ ఐటీ కళాశాల తరలిపోతుందా అని ఆందోళన వ్యక్తం చేశారు. వెనుకబడ్డ మాప్రాంతానికి కళాశాల వచ్చిందనే ఉద్దేశంతోనే పశువులకు మేతకోసం ఉన్న భూములను సైతం కళాశాల కోసం ఇచ్చామని కలెక్టర్‌కు వివరించారు. దీంతో అలాంటిది ఏమీలేదని వేలాది మంది విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంకోసం అన్ని రకాల సౌకర్యాల పరిశీలనలో నీటివసతి, రవాణా వంటి అవసరాల కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి ఇస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వెంకట్రావు, ఇంజినీర్ శాస్త్రి, తహసీల్దార్ దిలీప్‌కుమార్, డీపీఆర్‌ఓ కె.ఎన్.రెడ్డి, డీటీ నాసరుద్దీన్, సర్వేయర్ విష్ణు, వీఆర్‌ఓ వెంకటస్వామి పాల్గొన్నారు.
‘రావ్ అండ్ నాయుడు’లో తాత్కాలిక క్యాంపస్
ఒంగోలు టౌన్: ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి స్థానిక దక్షిణ బైపాస్‌రోడ్డులోని రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న టెంపరరీ క్యాంపస్‌లోని పనులను రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ చాన్సెలర్ కేసీ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఒంగోలుకు ట్రిపుల్ ఐటీ మంజూరైనప్పటికీ ఇడుపులపాడులో తరగతులు నిర్వహిస్తున్నారు. గత మూడు బ్యాచ్‌లకు ఇడుపులపాడులోని ట్రిపుల్ ఐటీ కాలేజీ క్యాంపస్‌లో తరగతులు జరుగుతున్నాయి. నాలుగో బ్యాచ్ అయిన ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ తరగతలు నిర్వహించాలని నిర్ణయించారు. అందుకుగాను స్థానిక దక్షిణ బైపాస్‌రోడ్డులోని రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీలో టెంపరరీ క్యాంపస్ ఏర్పాటు చేశారు.
ఈ క్యాంపస్‌లో 2019–2020 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలి బ్యాచ్‌తోపాటు గత ఏడాదికి సంబంధించిన బ్యాచ్ తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులకు సంబంధించిన డైనింగ్ హాల్, బాత్‌రూమ్‌ల పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే ట్రిపుల్ ఐటీ తరగతులు ఇక్కడ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న పనులను చాన్సెలర్ కేసీ రెడ్డి స్వయంగా పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సి. వెంకట్రావు ఉన్నారు.
యర్రజర్లలో స్థల పరిశీలన
ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇక్కడికి సమీపంలోని యర్రజర్లలో ఏర్పాటు చేసే విషయమై చాన్సెలర్ కేసీ రెడ్డి అక్కడి స్థలాలను పరిశీలించారు. ట్రిపుల్ ఐటీ కాలేజీ నిర్మాణానికి సరిపడే విధంగా స్థలం ఉందా, విద్యార్థులకు పూర్తి స్థాయిలో వసతులు సమకూర్చేందుకు ఆ ప్రాంతం అనువుగా ఉందా, అక్కడ నీటి లభ్యత ఏవిధంగా ఉందన్న వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్‌తో భేటీ
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ చాన్సెలర్ కేసీ రెడ్డి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్‌తో ఆయన చాంబర్‌లో భేటీ అయ్యారు. ట్రిపుల్ ఐటీ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై కలెక్టర్‌తో చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో పామూరు మండలం దూబగుంట వద్ద ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి స్థలాన్ని సేకరించారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే ప్రాంతంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేస్తే రవాణా పరంగా, అక్కడ విద్యార్థులకు తాగునీటి పరంగా తలెత్తే సమస్యల గురించి కేసీ రెడ్డి కలెక్టర్‌తో చర్చించారు. యర్రజర్లలో చూసిన స్థలం గురించి కూడా కలెక్టర్‌తో చర్చించారు.