‘పెద్దల’ ఎన్నిక అనివార్యం
‘పెద్దల’ ఎన్నిక అనివార్యం
Published Sat, Feb 1 2014 1:36 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
రాజ్యసభ బరిలో ఏడుగురు అభ్యర్థులు.. 7న పోలింగ్
కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి
ఉపసంహరించుకున్న స్వతంత్ర అభ్యర్థి చైతన్యరాజు
ఆదాల నామినేషన్ ఉపసంహరణకు కాంగ్రెస్ నేతల విఫలయత్నం
తన పేరుతో కొందరు దొంగపత్రాలివ్వబోయారన్న ఆదాల
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి చివరి నిమిషం వరకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శుక్రవారం ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు రంగంలో మిగిలారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చివరి నిమిషంలో ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. మరో స్వతంత్ర అభ్యర్థి కేవీవీ సత్యనారాయణ రాజు (చైతన్య రాజు)ను మాత్రం కాంగ్రెస్ నేతలు రంగం నుంచి తప్పించగలిగారు. ఆదాలను బరి నుంచి తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పోటీలో ఉన్నట్లు ఆదాల ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్‌లతో పాటు ఆపార్టీ తిరుగుబాటు అభ్యర్థిఆదాల ప్రభాకర్‌రెడ్డి, తెలుగుదేశం నుంచి గరికపాటి మోహన్‌రావు, సీతారామలక్ష్మి, టీఆర్‌ఎస్ నుంచి కె.కేశవరావులు రంగంలో మిగిలారు. ఏడో తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని రిటర్నింగ్ అధికారి అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం ప్రకటించారు. ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు నుంచి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆరు స్థానాలకు 28వ తేదీన తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. ఒక దరఖాస్తు చెల్లలేదు. ఎనిమిది మంది బరిలో నిలిచారు. కాంగ్రెస్ అధికారిక అభ్యర్థులను ప్రకటించినందున ఆదాల ప్రభాకర్‌రెడ్డి, చైతన్యరాజులు పోటీ నుంచి వైదొలగాల్సిందేనని, వారి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలపైనా చర్యలు తప్పవని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఆదాలకు, చైతన్యరాజుకు మద్దతివ్వడంలేదని ఆ ఎమ్మెల్యేలతో ఆర్వోకు మద్దతు ఉపసంహరణ లేఖలు కూడా ఇప్పించారు. తీవ్ర చర్చల అనంతరం ఆ లేఖలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.
ఆదాల, చైతన్యరాజుల నామినేషన్లను ఆమోదించారు. వీరిద్దరినీ రంగం నుంచి తప్పించేందుకు రెండు రోజులుగా కాంగ్రెస్ నేతలు మంతనాలు సాగించారు. ఢిల్లీ పెద్దలతో పాటు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, అభ్యర్థులు కేవీపీ, టి.సుబ్బరామిరెడ్డిలు కూడా ప్రయత్నాలు చేశారు. చివరకు చైతన్యరాజును ఒప్పించగలిగారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఏ విషయం చెప్పకుండా దాటవేశారు. తిరుగుబాటు అభ్యర్థులను తప్పించేందుకు టీడీపీ, టీఆర్‌ఎస్ నేతలు కూడా మంత్రులు, ఇతర నేతల తో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, గరికపాటి మోహన్‌రావులు గంటాతో చర్చించారు.
ఉదయం నుంచి హైడ్రామా
తిరుగుబాటు అభ్యర్థుల ఉపసంహరణపై శుక్రవారం ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, శైలజానాధ్, ఎంపీలు ఉండ వల్లి అరుణకుమార్, సబ్బంహరిలు చైతన్యరాజును వెంటబెట్టుకొని వచ్చి ఆయనతో నామినేషన్‌ను ఉపసంహరింపచేశారు. ఆదాల కూడా ఉపసంహరణకు అంగీకరించారని మంత్రులు తెలిపారు. అయితే ఆయన ఎంతసేపటికీ అక్కడికి రాలేదు. చివరకు ఆయనకు మద్దతుగా సంతకం పెట్టిన వెంకటరామయ్యను ఆర్వో వద్దకు పంపి ఆదాల తరపున నామినేషన్‌ను ఉపసంహరణ పత్రం సమర్పణకు అవకాశముందా? అని అడిగించారు. ఆయన సంతకం చేసిన నామినేషన్ ఉపసంహరణ పత్రం తెస్తే అనుమతిస్తామని రిటర్నింగ్ అధికారి తెలిపారు. మరో అయిదు నిమిషాల్లో సమయం ముగుస్తుందనగా వెంకటరామయ్య కొన్ని పత్రాలు తీసుకొని సీఎల్పీ కార్యాలయం నుంచి హడావుడిగా ఆర్వో వద్దకు వెళ్లారు. దీంతో ఆదాల నామినేషన్ ఉపసంహరణ పత్రాలు ఆర్వోకు అందాయని, ఎన్నిక ఏకగ్రీవం అయ్యిందని మంత్రులు, ఎంపీలు మీడియాకు చెప్పారు. దీనిపై మీడియాలో స్క్రోలింగ్‌లు రావడంతో ఆదాల వెంటనే అసెంబ్లీలోని తన పీఏకు ఫోన్ చేసి నామినేషన్ ఉపసంహరణ పత్రాలు ఎవరికీ ఇవ్వలేదని, అలా ఎవరైనా ఇస్తే అవి ఫోర్జీరీ పత్రాలుగా భావించి క్రిమినల్ కేసులు పెడతానని ఆర్వోకు చెప్పాలని సూచించారు. ఆ పీఏ అసెంబ్లీ కార్యదర్శి దగ్గరకు వెళ్లి అక్కడి నుంచే ఆదాలతో ఫోన్లో మాట్లాడించారు. ఆదాల అదే విషయాన్ని రిటర్నింగ్ అధికారికి స్పష్టంచేశారు. దీంతో కార్యదర్శి తనకు ఎలాంటి పత్రాలు అందలేదని, ఎవరైనా పత్రాలు ఇచ్చినా తాను అనుమతించబోనని స్పష్టంచేశారు.
హుషారుగా వచ్చి విచారంగా వెనుదిరిగిన కేకే
ఇద్దరు అభ్యర్ధులు ఉపసంహరించుకున్నారన్న వార్తలతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.కేశవరావు, శాసన సభాపక్ష నేత ఈటెల రాజేందర్, మరికొందరు ఎమ్మెల్యేలు, టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డిలు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. మంత్రులు, ఎంపీలు కేకేకు శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకున్నారు. అభ్యర్థులను ఉపసంహరించినందుకు మంత్రి గంటాకు కేకే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమైక్య రాష్ట్రం కోసం ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలంతా ఢిల్లీలో పోరాడాల్సి ఉన్నందున, దానికి ఆటంకం కాకుండా ఉండేందుకే అభ్యర్థులను ఉపసంహరింపచేశామని గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డిలు మీడియాకు వివరణ కూడా ఇచ్చారు. కానీ, ఆదాల నామినేషన్ ఉపసంహరించుకోలేదని తెలియడంతో కేకే సహా అందరూ విచార వదనంతో వెనుదిరిగారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఆదాల అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తాను ఉపసంహరించుకోలేదని, కొందరు కుట్ర పన్ని తన సంతకం లేకుండానే తన తరపున దొంగపత్రాలు వెంకటరామయ్య ద్వారా ఆర్వోకు ఇవ్వబోయారన్నారు. ఉపసంహరించుకోవాలని సీఎం తనను నాలుగుసార్లు కోరారని, సమైక్యం కోసమే బరిలో కొనసాగుతున్నానని వివరించారు. ఆ తరువాత ఆదాల రిటర్నింగ్ అధికారి సదారాంను కలిసి మాట్లాడారు. ఆదాల ఉపసంహరించుకోకపోడంతో మంత్రులు, కాంగ్రెస్ అభ్యర్థులు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించారు. ఈనెల ఏడో తేదీన జరిగే పోలింగ్‌కు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకొనే పనిలో పడ్డారు.
Advertisement