గర్భశోకం | Rakhi hugely tragic paurnamina | Sakshi
Sakshi News home page

గర్భశోకం

Published Mon, Aug 11 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

గర్భశోకం

గర్భశోకం

  •    గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణానదిలో మృతదేహాలు లభ్యం
  •   పెనమలూరు, చోడవరం, తాడిగడపల్లో విషాదఛాయలు
  •   విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మృత్యుఘోష
  • వారు ముగ్గురు ప్రాణస్నేహితులు. రోజూ కలిసే కళాశాలకు వెళ్లి వస్తుంటారు. చదువులోనూ ముందంజలో ఉంటారు. ఏమైందో తెలియదు కానీ ముగ్గురూ కలిసే కృష్ణమ్మ ఒడిలో తనువు చాలించారు. తమపైనే ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిల్చారు. తెల్లారితే రాఖీ పండుగ.. చిన్నారి చెల్లి పూజిత వచ్చి రాఖీ కడుతుందని అన్నయ్య ఎదురు చూస్తున్నాడు.. పల్లవక్క వచ్చి రక్షాబంధనం చేస్తుందని చిన్నారి తమ్ముడు నిరీక్షిస్తున్నాడు. కానీ వారి నిరీక్షణ ఫలించలేదు. పూజిత, పల్లవి.. ఇద్దరూ విగతజీవులై ఇంటికి రావటం ఆ అన్నదమ్ములతోపాటు కుటుంబ సభ్యులకూ అంతులేని విషాదాన్ని మిగిల్చింది.
     
    విజయవాడ/తాడేపల్లి రూరల్/మంగళగిరి : కళాశాలకు వెళ్తున్నామని ఇంటి నుంచి బయలుదేరిన ముగ్గురు స్నేహితులు కలిసే మృత్యు ఒడికి చేరారు. కన్నవారి కలలను కల్లలు చేస్తూ కడుపుకోతను మిగిల్చారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు నిర్జీవంగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంచలనం సృష్టించిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    పెనమలూరుకు చెందిన బిళ్ల పల్లవి(18), చోడవరానికి చెందిన సరిపూడి పూజిత(17), తాడిగడప సెంటర్ సమీపంలో నివసించే యలమంచిలి నాగలక్ష్మి బందరు రోడ్డులోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూపు ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. పూజిత, పల్లవి ఇద్దరు పదో తరగతి వరకు పెనమలూరులోని ఓ పాఠశాలలో కలిసే చదువుకున్నారు. శనివారం ఉదయం యథావిధిగా ఇంటి నుంచి బయలుదేరిన ఈ ముగ్గురు కళాశాలకు వెళ్లలేదు. దీంతో కళాశాల ప్రతినిధులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పల్లవి తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్‌ను కలిసి వెళ్లారు.

    ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థినులు శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణానది ఇసుక తిన్నెలపైకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. కొద్దిసేపటి తర్వాత వారి బ్యాగులు మాత్రమే కనిపించగా, విద్యార్థినుల ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకుని బ్యాగులు స్వాధీనం చేసుకున్న పోలీసులకు ఆదివారం ఉదయం మృతదేహాలు లభించాయి. తల్లిదండ్రులు సంఘటనా స్థలికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు.
     
    చిట్టీ తల్లీ..! చీకటంటే భయం కదే..! : ‘ఎంత పని చేశావు బిడ్డా.. నాన్న, చెల్లి, నేను.. గుర్తుకురాలేదా? కాస్త దూరం నడిస్తే కాళ్లు నొప్పులమ్మా.. అంటూ ఏడ్చేదానివిగా, ఇంతదూరం నడుచుకుంటూ ఎలా వచ్చావమ్మా? నువ్వు చనిపోలేదు, నన్ను ఏడిపించేందుకే ఇలా చేస్తున్నావు, లేమ్మా.. నీకు చీకటి అంటే భయంగా కదా! కరెంటు పోతే ‘కెవ్వుమని కేకేసేదానివి కదా..! రాత్రి చీకటిలో నీళ్లలో తడుస్తూ ఎలా ఉన్నావమ్మా..’ అంటూ నాగలక్ష్మి తల్లి మాధవి బోరున విలపించారు. చీర చెంగుతో బిడ్డ మొహం తుడుస్తూ లేపేందుకు ఆమె ప్రయత్నించటం అందరినీ కలచివేసింది. నాగలక్ష్మి తండ్రి శ్రీనివాసరావు విజయవాడ ఆటోనగర్‌లో పనిచేస్తున్నారు. తల్లి మాధవి గృహిణి. వీరికి ఇద్దరు ఆడపిల్లలు.

    పెద్దమ్మాయి నాగలక్ష్మి 11 గంటలకే ఇంటికి వచ్చింది. 4.30 గంటలకు కూడా ఫోన్‌లో మాట్లాడింది. ఇంట్లోనే ఉన్నానంటూ హైదరాబాద్‌లోని మేనమామకు, తల్లికి చెప్పింది. తర్వాత బయటకెళ్లిన ఆమె చీకటిపడ్డా కనిపించకపోవడంతో కంగారుపడిన తండ్రి ఫోన్‌చేసి చెప్పడంతో మాధవి ఫ్రెండ్స్, బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశారు. సమాచారం దొరక్కపోవడంతో వెంటనే బయలుదేరి పెనమలూరు వచ్చారు. ఇంతలోనే పోలీసులు ఫోన్ చేసి విషయం చెప్పారు.
     
    తెల్లారాక ఫిర్యాదు చేద్దామనుకుంటే : మృతుల్లో ఒకరైన సరిపూడి పూజితకు తండ్రి లేడు. ఏడేళ్ల క్రితమే మరణించారు. అమరావతి మండలం లింగాపురం సొంతూరు. పూజిత తండ్రి మరణించడంతో పిల్లలకు మంచి చదువులు చదివించాలని పెనమలూరు మండలం చోడవరంలోని బంధువుల దగ్గరకు వచ్చి ఉంటున్నారు. శనివారం పూజిత రాలేదని కాలేజి నుండి ఫోన్ రాగా తల్లి శివనాగలక్ష్మి కంగారు పడ్డారు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లిందేమోనని సరిపెట్టుకున్నారు. చీకటిపడ్డా రాకపోవడంతో కంగారుపడ్డారు. తెల్లవారేదాకా చూసి పోలీసులకు ఫిర్యాదు ఇద్దామనుకుంటే ఇంతలోనే విషయం తెలిసి భోరున విలపించారు.
     
    పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు..: బిళ్లా పల్లవి తండ్రి రాంబాబు ఎలక్ట్రీషియన్. ఇంటికి ఒక్కతే ఆడపిల్ల కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. శనివారం కాలేజీకి రాలేదంటూ ఫోన్ రావడంతో కంగారుపడిన తండ్రి స్నేహితులు, బంధువులను విచారించారు. చీకటిపడ్డా రాకపోవడంతో పోలీసుస్టేషన్‌కు వెళ్లగా వారు ఫిర్యాదు స్వీకరించలేదు. ఉ. 10 గంటలకు అమ్మాయి ఫొటో తెస్తే ఎంక్వైరీ చేస్తామని పోలీసులు చెప్పారని రాంబాబు చెప్పారు. రాత్రంతా ఆందోళనతో గడిపానని, తెల్లరేసరికి మరణవార్త విన్నామని గొల్లుమన్నారు.
     
    తల్లిదండ్రులకు మృతదేహాలు అప్పగింత

     
    కాగా, ముగ్గురు విద్యార్థినుల మృతదేహాలకు వారి తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో మంగళగిరి సీఐ హరికృష్ణ, తాగేపల్లి ఎస్‌ఐ వినోద్‌కుమార్‌లు పంచనామా నిర్వహించారు. పంచనామా, పోస్టుమార్టం అనంతరం విద్యార్థినుల మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించారు. యలమంచిలి నాగలక్ష్మి, బిల్లా పల్లవి అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. పూజిత మృతదేహాన్ని అమరావతి సమీపంలోని లింగాపురానికి తీసుకెళ్లారు. సోమవారం ఆమె అంత్యక్రియలు చేస్తారు.
     
    తల్లిదండ్రులకు సమాచారమిచ్చాం : కళాశాల ప్రిన్సిపాల్
     
    ముగ్గురు విద్యార్థినులు శనివారం కళాశాలకు రాలేదని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని సదరు కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. దీంతో పల్లవి తల్లిదండ్రులు వెంటనే కళాశాలకు వచ్చి ఆరా తీశారని చెప్పారు. నాగలక్ష్మి తండ్రి తమ కుమార్తెకు బాగోలేదని చెప్పినట్లు తెలిపారు. పల్లవి, నాగలక్ష్మి శుక్రవారం కూడా కళాశాలకు రాలేదని, ఆ సమయంలో గుడికి వెళ్లినట్లు తల్లిదండ్రులు చెప్పారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. మరణించిన ముగ్గురు విద్యార్థినులు చదువులో కూడా ముందంజలో ఉంటారని వివరించారు. ఇతర కారణాలు తమకు తెలియవని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement