
‘సుప్రీం’ న్యాయమూర్తిగా జస్టిస్ రమణ
రాష్ట్రానికి చెందిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నెల 13న ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.
నియామక ఫైల్‌పై రాష్ట్రపతి ఆమోదముద్ర
13న ప్రమాణ స్వీకారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నెల 13న ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. జస్టిస్ రమణ ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి ఆయన పేరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసింది. జస్టిస్ రమణ నియామకపు ఫైల్ కేంద్ర న్యాయశాఖ నుంచి ప్రధానమంత్రి కార్యాలయానికి, అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లింది. దీనిని పరిశీలించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. జస్టిస్ ఎన్‌వీ రమణ 1957 ఆగస్టు 27న కృష్ణా జిల్లా పొన్నవరంలో జన్మించారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. క్యాట్, ఏపీఏటీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సివిల్, క్రిమినల్ కేసులతో పాటు రాజ్యాంగపరమైన వివాదాల్లో వాదనలు వినిపించారు.
పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. అలాగే అదనపు అడ్వొకేట్ జనరల్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2000, జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. తర్వాత 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన తర్వాత సీనియారిటీ ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే జస్టిస్ కోకా సుబ్బారావు తరువాత ఈ పదవిని అధిష్టించిన రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ రమణే అవుతారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే దాదాపు ఏడాదిన్నర పాటు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది.