కావలి: నవభారత నిర్మాత జవహర్‌లాల్ నెహ్రూ దార్శనికత ఆ నాటి యువకులపై ప్రగాఢమైన ముద్ర వేసింది. డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి(డీఆర్) (1929-2010) మీద ఆ ప్రభావం ప్రసరించింది. మద్రాసులో ఆయన చదువుకునే రోజుల్లో ఆ నగర పేవ్‌మెంట్ల మీద బతికే కూడు, గూడు లేని ప్రజలను చూసి ఆయన చలించిపోయాడు.
విద్య అందరి జీవితాల్ని మారుస్తుందని భావించి తను పుట్టి పెరిగిన ఊరు కావలిని కార్యక్షేత్రంగా చేసుకొన్నాడు. సమాజాన్ని మార్చాలనే తన స్వప్నాన్ని సాకారం చేసుకొనేందుకు ఆయన బావ పుచ్చలపల్లి హరిశ్చంద్రారెడ్డి బాసటగా నిలబడటంతో నెల్లూరు జిల్లా మొత్తం తిరిగి విరాళాల సేకరణ చేశారు.
నెహ్రూ స్ఫూర్తితో....
డీఆర్ తాను పెట్టబోయే కళాశాలకు నెహ్రూ పేరు పెట్టాలని భావించారు. దీనికి నెహ్రూ అనుమతి కోసం రామానుజరావునాయుడు, భుజంగ రాయశర్మలను తీసుకుని ఢిల్లీ వెళ్లారు. దుర్గాబాయ్‌దేశ్‌ముఖ్‌ను కలుసుకొన్నారు. ఆమె వారిని మోటూరు సత్యనారాయణకు అప్పజెప్పారు. ఆయన వీరిని తీన్‌మూర్తి భవన్‌కు వెళ్లారు. మోటూరు వీరు వచ్చిన విషయం నెహ్రూకు చెప్పారు.
తాను బతికుండగానే తన పేరు పెట్టడం ఇష్టం లేదని నెహ్రూ చెప్పారు. దీంతో కావలి కళాశాల అని పేరు పెట్టారు. నెహ్రూ మరణాంతరం ఇందిరాగాంధీ అనుమతితో 1965 లో నాటి ఉపరాష్ర్టపతి జాకీర్ హుస్సేన్ కావలి కళాశాల పేరును జవహర్ భారతిగా మార్చారు. 1951 వరకు ఉత్తర పెన్నా తాలుకాలో ఒక్క కాలేజీ కూడా లేదు. బెజవాడ గోపాలరెడ్డి చొరవతో నాటి అవిభక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఎస్.కుమారస్వామి నూరు ఎకరాల ప్రభుత్వ భూమిని కావలి కాలేజీకి మంజూరు చేశారు.
విశ్వోదయ పర్యవేక్షణలో జవహర్ భారతి డిగ్రీ , పీజీ కళాశాల, రెండు ఇంజనీరింగ్ కళాశాలలను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. బెజవాడ గోపాలరెడ్డి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్, విశ్వోదయ ప్రిపరేటరీ స్కూలు కొంతకాలం నడిచాయి. జవహర్ భారతిలో పెద్దాడ రామస్వామి, వేదుల సత్యనారాయణ శాస్త్రి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, భుజంగరాయ శర్మ, పట్టాభిరామరెడ్డి , మాధవరావు, కెవి రమణారెడ్డి, మాణిక్యరావు, నటరాజన్, రాధాకృష్ణ వంటి ఉద్దండులు అనేక మంది పనిచేశారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి కుమారస్వామి టాంపో, ఎస్.వి. యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్ ఎం.రామానుజరావు నాయుడు ప్రిన్సిపాల్స్‌గా పనిచేశారు.
ఎందరినో గౌరవించారు....
ప్రతి సంవత్సరం నవంబరు 14న విశ్వోదయ వ్యవస్థాపక దినోత్సవం నాడు, కవి, గాయక, వైతాళికులను సన్మానించి గౌరవజీవిత సభ్యత్వాన్ని ప్రదానం చేస్తారు. ఆ విధంగా అందుకున్న వారిలో బీఎన్.రెడ్డి, ద్వారం నాయుడు, పీ.భానుమతి, దేవులపల్లి, జకీర్‌హుస్సేన్, కోకా సుబ్బారావు, జీడీ.నాయుడు, ఫాదర్‌మర్ఫీ. ఆల్బర్ట్ ఫ్రాంక్లిన్, దేశ్‌ముఖ్ దంపతులు, పీపీ.రావు, సీ.నారాయణరెడ్డి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బెజవాడ గోపాలరెడ్డి, ఘంటశాల, ఎస్‌పీ.బాల సుబ్రహ్మణ్యం, కోటి, తనికెళ్ల భరణి, గద్దర్, ప్రముఖ పాత్రికేయులు, నార్ల, పొత్తూరి, ఏబీకే.ప్రసాద్, కె.రామచంద్రమూర్తి, రాజాలక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పీవీ.రమణయ్య రాజా తదితరులు ఉన్నారు.
నేడు డీఆర్ మెమోరియల్ లెక్చర్
కావలిఅర్బన్ : విశ్వోదయ వ్యవస్థాపకులు డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి 86వ జయంతిని శనివారం జవహర్ భారతి టీచర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ డీఆర్ మెమోరియల్ లెక్చర్ ఏర్పాటు చేస్తున్నామని జేబీటీఏ అధ్యక్షుడు డాక్టర్ ఎం. చలపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. జవహర్ భారతి కళాశాల క్యాంపస్‌లోని శంకరన్ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విద్యారంగంలో ఎయిడెడ్ వ్యవస్థ ప్రాధాన్యత, ప్రస్తుత పరిస్థితి అనే అంశంపై మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తారని చెప్పారు. సామాజిక మార్పులో విద్య పాత్ర అనే అంశంపై నాగార్జున యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ నూర్‌బాషా ప్రసంగిస్తారని తెలిపారు.
భారీస్థాయిలో సెమినార్లు...
జవహర్ భారతి విద్యా ఔన్నత్యాన్ని పెంచడానికి సెమినార్లు భారీస్థాయిలో జరిగాయి. శంకరన్ జీఎస్.మేల్కొటే, అనంతశయనం అయ్యంగార్, వెన్నెలకంటి రాఘవయ్య, చరిత్రకారులు బిపిన్‌చంద్ర, నేలటూరు వెంకటరమణయ్య, ఓరుగంటి రామచంద్రయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, భాట్టం శ్రీరామమూర్తి, గౌతు లచ్చన్న, తదితరులు పాల్గొన్నారు. విద్యారంగంలో సరికొత్త ప్రయోగాలు ఏం జరిగినా జవహర్ భారతి ఆహ్వానించి జయప్రదంగా అమలు చేస్తూ వ చ్చింది. పేదరికంలో ఉండే విద్యార్థుల కోసం డీఆర్ ఎంతో చేశారు.
జవహర్ భారతిలో ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్, ఒక సాధారణ వసతి గృహం, దుర్గాబాయి బాలికల వసతి గృహం ఉన్నాయి. డీఆర్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సాయం చేస్తూ వుండేవారు. ఈ వ్యక్తిగత సాయపరంపరను ప్రస్తుతం రెక్టార్ వినయ కుమార్‌రెడ్డి కొనసాగిస్తున్నారు.
ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మాణం...
1961లో పుచ్చలపల్లి హరిశ్చంద్రారెడ్డి ఓపెన్‌ఎయిర్ థియేటర్‌ను నిర్మించారు. యామిని కృష్ణమూర్తి, వేదాంతం సత్యనారాయణ శర్మ, శోభానాయుడు, మంజు భార్గవి, రత్న పాప, గద్దర్ మొదలైన వారు గజ్జెకట్టి తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించేవారు. రజతోత్సవాల్లో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, స్వర్ణోత్సవాల్లో మాజీ గవర్నర్ వీఎస్ రమాదేవి, వజ్రోత్సవాల్లో మాజీ కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి, ైవె స్ ఛాన్సలర్ రాజారామరెడ్డి, మాజీ వైస్ ఛాన్సలర్ సీఆర్ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. ముగింపు సమావేశాల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొని వజ్రోత్సవ సావనీర్ స్వప్నరేఖను ఆవిష్కరించారు. డీఆర్‌కు విశ్వోదయ ఆట విడుపు కాదు. కాలక్షేపమూ కాదు. ఆత్మసాక్షాత్కారము. ఆ మహానుభావుడికి ఇదే నా శ్రద్ధాంజలి.
కేవీ కోటిలింగం,
విశ్రాంత అధ్యాపకుడు,
కావలి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
విద్యాప్రదాత డీఆర్
Published Sat, Jul 4 2015 1:48 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement
Advertisement