గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : ప్రభుత్వం విడుదల చేసిన జీఓలకే విలువ లేకపోతే ఎలాగని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని, ఆత్యహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరుతూ విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఏపీ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం 30 గంటల సామూహిక సత్యాగ్రహం చేపట్టారు. తొలుత అగ్రిగోల్డ్ బాధితులు సీపీఐ రాష్ట్ర కార్యాలయం నుంచి గ్రంథాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఆత్మహత్యలకు పాల్పడిన అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామంటూ ప్రభుత్వం జారీ చేసిన జీఓలకు విలువ లేకుండా పోయిందన్నారు. జీఓ విడుదల చేసి మూడునెలలు అవుతున్నా పరిహారం అందలేదని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా తక్షణమే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఇదే చివరి హెచ్చరికని స్పష్టంచేశారు. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన అవసరమైతే సీఎం ఇంటిని ముట్టడించేందుకు వెనుకాడబోమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment