‘రంగస్థలం’లో నకిలీలు | Rangasthalam Fake ID Cards Issued In West Godavari | Sakshi
Sakshi News home page

‘రంగస్థలం’లో నకిలీలు

Published Thu, Jul 26 2018 11:18 AM | Last Updated on Thu, Jul 26 2018 1:56 PM

Rangasthalam Fake ID Cards Issued In West Godavari - Sakshi

పౌరసంబంధాల శాఖ సహాయ సంచాలకులు తరఫున రామలింగేశ్వరరావు జారీ చేసిన కళాకారుల గుర్తింపుకార్డు

రంగస్థల కళాకారుల గుర్తింపు కార్డుల జారీలో నకిలీ బాగోతం బయట పడింది. నకిలీ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసు కున్న 34 మందికి అధికారులు గుడ్డిగా కార్డులు జారీ చేసేశారు. నిడమర్రు                 తహసీల్దారు సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ తతంగాన్ని నడిపించారని తేలింది.

పశ్చిమ గోదావరి, నిడమర్రు : నాటక రంగాన్ని వృత్తిగా మార్చుకున్న పేద కళాకారులను గుర్తించి వారికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక సంక్షేమ పథకాలు, ఇతర సౌకర్యాలు అందించేందుకు తెలుగుభాషా సాంస్కృతిక వ్యవహారాలశాఖ ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. ఈ కార్డుల జారీలో సంబంధిత శాఖ జిల్లాస్థాయి ఉద్యోగులు కొంతమంది ముఠాగా ఏర్పడి అనర్హులకు వందల కొద్దీ నకిలీ గుర్తింపు కార్డులను జారీ చేసినట్టు తెలుస్తోంది. నాటక రంగానికి ఏమాత్రం పరిచయం లేని అనేకమందికి తహసీల్దారు డిజిటల్‌ సంతకం ఫోర్జరీ చేసి రంగస్థల వృత్తి కళాకారులుగా గుర్తింపు కార్డులు జారీ చేశారు. నకిలీ గుర్తింపు కార్డుల వ్యవహారంపై తీగలాగితే డొంకంతా కదులుతున్నట్లు తెలిసింది.

నకిలీ కార్డులు వెలుగులోకి ఇలా..
ఈనెల 22న నిడమర్రు మండల వృత్తి కళాకారుల సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక పెదనిండ్రకొలను గ్రామంలో జరిగింది. సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం చేసే విషయంలో కళాకారుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో   సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి అప్పారావు ఆధ్వర్యంలో ఒక కార్యవర్గం జాబితా, ఉంగుటూరు నియోజకవర్గం కన్వీనర్‌ చల్లా సూర్యారావు ఒక  కార్యవర్గ జాబితాఎవరికి వారే ప్రకటించుకుని ప్రమాణ స్వీకారం చేసి ముగించారు. అయితే ఈఎన్నికకు కళాకారులుగా గుర్తింపు కార్డులతో హాజరైన సభ్యులపై  బొడ్డేపల్లి అప్పారావు వర్గానికి అనుమానం కలిగి జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లగా నిడమర్రు తహసీల్దారు డిజిటల్‌ సంతకం ఫోర్జరీ చేసిన నకిలీ ధ్రువీకరణ పత్రాలతో 34 వరకూ తెలుగుభాషా సాంస్కృతిక వ్యవహారాల శాఖకు దరఖాస్తు చేసినట్టు తెలిసింది. అప్పటి వరకూ నకిలీ ధ్రువీకరణ పత్రాలు స్వీకరించినట్లు  జిల్లా అధికారులు సైతం గమనించకపోవడం గమనార్హం.

డిజిటల్‌ సైన్‌తో నకిలీ ధ్రువీకరణలు
ఈ– ఆఫీస్‌ ద్వారా జారీ చేసే డిజిటల్‌ సైన్‌ ముద్ర, ఫైల్‌ నంబర్‌తో ఈ నకిలీ దందా బహిర్గతమైంది. నిడమర్రు మండలంలోని పలువురు తమని వృత్తి కళాకారులుగా గుర్తించాలని నిడమర్రు తహసీల్దారుకు  దరఖాస్తు చేసుకున్నారు. ఆయా గ్రామాల పెద్దలను రెవెన్యూ సిబ్బందితో విచారించి అడవికొలను, చానమిల్లి, నిడమర్రు గ్రామాలకు చెందిన 9 మందిని వృత్తి కళాకారులుగా గుర్తించి ఈనెల 9న ఈ– ఆఫీస్‌ ద్వారా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసారు. అయితే ఈ ధ్రువీకరణ పత్రాలపై ఉన్న డిజిటల్‌ సంతకం ముద్రను స్కానింగ్‌ చేసి ఫొటోషాప్‌ ద్వారా మరి కొంతమందికి నిడమర్రు తహసీల్దారు జారీ చేసినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు రూపొందించారు. అయితే తయారు చేసిన నకిలీ ధ్రువీకరణ పత్రాలపై ఒకే ఫైల్‌ నంబర్‌ 397 ఉంది. అలాగే స్కానింగ్‌ చేసిన ముద్ర కావడంతో తేదీ, సమయం మారలేదు. దీంతో ఒక సెకనులో 34 వరకూ ధ్రువీకరణ పత్రాలు ప్రింట్‌ చేసినట్లు అయ్యింది.

ఆగమేఘాల మీద కార్డుల జారీ
దరఖాస్తు చేసుకున్న రోజే గుర్తింపు కార్డులను అ«ధికారులు జారీ చేశారు. అలాగే ప్రతి విషయం డిజిటలైజేషన్‌ జరుగుతన్న తరుణంలో ఇంకా అధికారులు చేతిరాతతో రాసిన గుర్తింపుకార్డులు జారీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ నకిలీ దరఖాస్తులపై ఈనెల 19న దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా పౌరసంబంధాలశాఖ కార్యాలయం ముద్ర ఉంది. అదే రోజు వారందరికి చేతిరాతతో గుర్తింపు కార్డులను సహాయ సంచాలకులు తరఫున కిందిస్థాయి ఉద్యోగి ఇ.రామలింగేశ్వరరావు జారీ చేసినట్లు కార్డుల్లో పేర్కొన్నారు. ఈ విషయంపై ఇ. రామలింగేశ్వరరావును వివరణ కోరగా ఉన్నత అధికారులు బిజీగా ఉంటే, వారి తరఫున కళాకారుల గుర్తింపు కార్డులు తను జారీ చేసే అధికారం ఉందని తెలిపారు.

ధ్రువీకరణ పత్రాలు పరిశీలించకుండానే
ఒక మండలం నుంచి ఒకేసారి కొత్త దరఖాస్తులు 34  వచ్చినప్పుడు సదరు జిల్లా  అధికారులకు అనుమానం రాకపోవడాన్ని కళాకారులు తప్పపడుతున్నారు. దరఖాస్తులు సమగ్రంగా పరిశీలిస్తే ఈ పొరపాటు జరగదని వారు చెబుతున్నారు. ఒక్కో కార్డుకు రూ.10 వేల వరకూ వసూలుచేసినట్టు తెలుస్తోంది. ఈ నకిలీ ముఠాలోకొంతమంది కళాకారులు, జిల్లా ఉద్యోగులతోపాటు, ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు హస్తం ఉన్నట్లు  కళా కారుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంగళవారం సహాయ సంచాలకురాలు సుభాషిణికి పిర్యాదు చేసినట్లు సమాచారం.

సంతంకం ఫోర్జరీ జరిగితే చర్యలు
మండలంలో కళాకారులుగా గుర్తించాలని అందిన దరఖాస్తులపై పూర్తి విచారణ చేసి ఈనెల 9న తొమ్మిది మంది కళాకారులకు గుర్తింపు కార్డుల కోసం ధ్రువీకరణ పత్రాలు ఈ–ఆఫీస్‌ ద్వారా జారీ చేశాము. అయితే మరి కొంత మంది నా డిజిటల్‌ సంతకం ఫోర్జరీ చేసి కొత్తగా కార్డులు పొందినట్లు ఫిర్యాదు అందింది. ఈ మేరకు సంబంధిత శాఖ సహాయక సంచాలకులకు విచారణ చేయాలని రాతపూర్వకంగా తెలియజేశా. అలాగే మీ–సేవా కేంద్రాలు, ఇంటర్నెట్‌ సెంటర్లపై నిఘా పెట్టాలని గణపవరం సీఐ, నిడమర్రు ఎస్సైలను కోరాను. సంతకం «ఫోర్జరీ జరినట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.   – ఎం.సుందర్రాజు, తహసీల్దారు, నిడమర్రు

పేద కళాకారులకు అన్యాయం
అనర్హులకు గుర్తింపు కార్డులు జారీ చేయడం వల్ల నిజమైన వృత్తి కళాకారులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే కళాకారులకు ప్రభుత్వం నుంచి లబ్ధి అరకొరగానే  అందుతోంది. ఈ నకిలీలను అరికట్టకపోతే భవిష్యత్‌లో కళాకారులపై ప్రజల్లో చులకన భావం పెరుగుతుంది.– బొడ్డేపల్లి అప్పారావు, జిల్లా అధ్యక్షుడు, రంగస్థల వృత్తి కళాకారుల సంఘం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement