
పెళ్లకూరులోని రాణి భూముల్లో స్థానికేతరులు సాగు చేస్తున్న వరి
పెళ్లకూరు: పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ భూములను అధికారులు చేతివాటంతో స్థానికేతరులకు అప్పగించేందుకు అధికారపార్టీకి చెందిన ఓ నేత కనుసన్నల్లో ఇక్కడి వీఆర్వో నుంచి తహసీల్దార్ వరకు అందరూ సూత్రధారులై ‘రాణి భూములు’ విక్రయానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మండల కేంద్రం పెళ్లకూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1/1 నుంచి 1/5లో 310 ఎకరాల సీలింగ్ భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ స్థానికులైన నిరుపేదలకు చెందాలని అప్పట్లో వెంకటగిరి రాణి సామ్రాజ్యలక్ష్మి వీలునామా రాసినట్లు సమాచారం. అయితే శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఓజిలి మండలాలకు చెందిన మైనంపాటి మునెయ్య, వేము కృష్ణయ్య, గెడ్డాం జ్ఞానమ్మ, కోవి వెంకటసుబ్బయ్య అనే స్థానికేతరులు 19.50 ఎకరాలను ఆక్రమించుకొని చాలా కాలంగా సాగు చేస్తున్నారు. ఇక్కడ స్థానికేతరులు సాగుచేస్తున్న 19.50 ఎకరాలు కూడా పేదలకే పంపిణీ చేయాల్సిఉంది. అయితే అప్పట్లో స్థానికేతరులు తాము సాగుచేస్తున్న భూములపై తమకే హక్కు ఉందంటూ సూళ్లూరుపేట కోర్టులో రిట్ వేశారు. పెళ్లకూరులోని ప్రభుత్వ భూములు స్థానిక పేదలకే చెందాలని స్థానికేతరులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది.
కొంతకాలానికి సాగుదారుల్లో ముగ్గురు చనిపోవడంతో వారి వారసులు మళ్లీ నెల్లూరు అప్పీలేట్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ స్థానికేతరులైన భూస్వాములకు కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అప్పటి కలెక్టర్ ఎం.జానకిని కలిసి తమకు భూములు పంపిణీ చేసి పట్టాలు మంజూరు చేయాలని స్థానికేతరులు కోరారు. అయితే కలెక్టర్ జానకి అప్పటి తహసీల్దార్ కేఎం రోజ్‌మాండ్‌ను తన కార్యాలయానికి పిలిపించుకొని 19.50 ఎకరాలకు సంబంధించి హైకోర్టులో రిట్ ఫిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. కానీ తహసీల్దార్ రోజ్‌మాండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయకుండానే బదిలీపై వెళ్లిపోయారు. గ్రామంలో కొందరు దళిత నాయకులు ఇటీవల స్థానిక తహసీల్దార్ నాగరాజలక్ష్మిని కలిసి హైకోర్టులో రిట్ దాఖలు చేయాలని రాత పూర్వకంగా విన్నవించారు. కానీ ఇక్కడి రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం తరపున హైకోర్టులో రిట్ దాఖలు చేయకుండా నెల్లూరు ఏటీసీ కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు భారీ కుంభకోణానికి ఎత్తుగడ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఎకరానికి రూ.35 వేలు
స్థానికేతరులైన భూస్వాముల ఆధీనంలో ఉన్న 19.50 ఎకరాల భూములకు పట్టాలు మంజూరు చేసేందుకు ఒక్కో ఎకరానికి రూ.35 వేల చొప్పున రెవెన్యూ యంత్రాంగం భేరం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత కలెక్టర్‌కు తెలియజేయకుండానే ఇక్కడి వీఆర్వో నుంచి తహసీల్దార్ వరకు భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని వేగంగా సర్వే పనులు పూర్తి చేయడం గమనార్హం. నెల్లూరు అప్పీలేట్ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేసేందుకు ఇక్కడ రెవెన్యూ అధికారులకు, స్థానికేతరులకు మధ్య అధికారపార్టీకి చెందిన ఓనాయకుడు పావులు కదుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జూన్ 15న ఇక్కడి 19.50 ఎకరాల భూములు సర్వేకి చలానా చెల్లించగా రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు 17వ తేదీ ఆదివారం అయినప్పటికీ క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది భూములను వేగవంతంగా సర్వే చేయడం గమనార్హం. సర్వే పనులు పూర్తి చేసి దానికి సంబంధించిన నమూనా రూపొందించడంతో స్థానికేతరుల నుంచి ఇక్కడి రెవెన్యూ అధికారులకు అడ్వాన్స్ పేమెంట్ రూ.5 లక్షలు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలకు తూట్లు
అప్పటి కలెక్టర్ ఎం.జానకి ఆదేశాలను పట్టించుకోకుండా ఇక్కడి రెవెన్యూ యంత్రాంగం స్థానికేతరులైన భూస్వాములకు భూములు అప్పగించేందుకు వేగవంతంగా ఫైళ్లు కదపడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు అప్పీలేట్ ట్రిబ్యునల్ కోర్టు స్థానికేతరులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ప్రస్తుత కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండానే ఇక్కడి రెవెన్యూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కోనేరు రంగారావు కమిటీ ప్రకారం మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల లోపు పట్టాలు మంజూరు చేయకూడదనే నిబంధనలు ఇక్కడ నీరుగారుతున్నాయి. కోర్టులో వ్యాజ్యం నడిపిన స్థానికేతరులు ప్రస్తుతం ముగ్గురు మృతిచెందారు. కానీ వాళ్ల వారసుల పేరుతో ఒక్కొక్కరి 5 ఎకరాల చొప్పున పట్టాలు మంజూరు చేసేందుకు ఇక్కడి రెవెన్యూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
సెంటు భూమి లేదు
గ్రామంలో మాకు సెంటు భూమి లేదు. ప్రతి రోజూ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నాం. కలెక్టర్ స్పందించి పేదలకు భూములు ఇప్పించాలి.– మేక వెంకటమ్మ, పెళ్లకూరు
Comments
Please login to add a commentAdd a comment