రక్షించిన ఆర్‌పీఎఫ్ సిబ్బంది
అపరిచితులను నమ్మవద్దని ఎస్‌ఐ రమణయ్య సూచన
తాడేపల్లి రూరల్ : అపరిచిత వ్యక్తి బారి నుంచి ఓ యువతిని తాడేపల్లి ఆర్‌పీఎఫ్ సిబ్బంది రక్షించిన సంఘటన తాడేపల్లి కృష్ణాకెనాల్ జంక్షన్‌లో గురువారం చోటుచేసుకుంది. ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ కెవి రమణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల సమీపంలో గాజులపల్లి గ్రామంలో నివాసం ఉండే యువతికి రెండు నెలల క్రితం గిద్దలూరుకు చెందిన వెంకటేశ్వరరావుతో వివాహం జరిగింది. బుధవారం రాత్రి యువతి భర్త వెంకటేశ్వరరావు కొట్టి ఇంటి నుంచి గెంటివేయడంతో పుట్టింటికి వెళదామని వచ్చిన మాధవి పొరపాటున విజయవాడ వచ్చే రైలు ఎక్కింది. ఈ సమయంలో రైల్లో పరిచయమైన ఓ అపరిచిత వ్యక్తి తన ఇంటికి తీసుకువెళతానంటూ నమ్మబలికి కృష్ణాకెనాల్ జంక్షన్‌లో దింపాడు. మరొకరిని తన భార్యలా యువతితో ఫోనులో మాట్లాడించాడు.
అతని మాటలు నమ్మిన యువతి కృష్ణాకెనాల్ జంక్షన్‌లో రైలు దిగి అపరిచితుడితోపాటు అతని ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది. అయితే సదరు అపరిచితుడు ఇంటికి తీసుకువెళ్లకుండా పాడు పడిన రైల్వే క్వార్టర్స్‌లోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేశాడు. యువతి పెద్దగా కేకలు వేయడంతో సమీపంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అక్కడికి వెళ్లారు. దీంతో సదరు అపరిచితుడు పరారయ్యాడు. యువతిని పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి గిద్దలూరు, నంద్యాల ఆర్‌పీఎఫ్ పోలీసులను సంప్రదించి మాధవి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు వచ్చిన అనంతరం యువతిని అప్పగించారు.
అపరిచితులను నమ్మవద్దు..
రైళ్లలో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మహిళలు అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ కెవి రమణయ్య సూచించారు. ప్రయాణంలో తెలియని వ్యక్తులు తినుబండారాలు ఇచ్చినా తీసుకోవద్దని, ఒకవేళ ఒక రైలు ఎక్కబోయి, మరో రైలు ఎక్కితే రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహించే సిబ్బందిని కలిసి సమాచారం తెలుసుకోవాలని, అపరిచితుల మాటలు నమ్మవద్దని ఆయన అన్నారు. భార్యభర్తల మధ్య గొడవలు అయిన సమయంలో ఇలాగే మహిళలు అసాంఘిక శక్తుల చేతుల్లో పడి వారి జీవితాలను కోల్పోతున్నారని అన్నారు.
యువతిపై అత్యాచార యత్నం
Published Fri, Aug 7 2015 1:16 AM | Last Updated on Sun, Sep 2 2018 3:43 PM
Advertisement