♦ బహిరంగంగానే రేషన్ బియ్యం రవాణా
♦ ఎస్పీలు మారడంతో పట్టుసడలించిన పోలీస్ అధికారులు
♦ వారం వ్యవధిలో వందల లారీల్లో తెలంగాణకు తరలింపు
♦ చెక్ పోస్టుల్లో మామూళ్లు అందుకుని సాగనంపుతున్న అధికారులు
సాక్షి, గుంటూరు : జిల్లాలో చాపకింద నీరులా జరుగుతున్న చౌక బియ్యం అక్రమ రవాణా కొద్ది రోజులుగా బహిరంగంగా మారింది. అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటున్నారని, అక్రమ రవాణాకు అడ్డుగా నిలుస్తున్నారనే కారణాలతో రూరల్ జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణను అధికార పార్టీ ముఖ్య నేతలు బదిలీ చేయించిన విషయం తెలిసిందే. ఆయన బాధ్యతలు నిర్వహించిన ఎనిమిది నెలల్లో జిల్లాకు చెందిన ఓ మంత్రి సొంత నియోజకవర్గంలోనే అక్రమంగా తరలిస్తున్న ఐదు లారీల బియ్యాన్ని పట్టుకుని క్రిమినల్ కేసులు పెట్టిన విషయం కూడా విధితమే.
ఈ నేపథ్యంలో ఎస్పీ బదిలీ కావడంతో జిల్లా పోలీసులు సైతం అక్రమ రవాణాపై పట్టు సడలించినట్లు తెలుస్తోంది. దీంతో అక్రమ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో వందల లారీల చౌక బియ్యం తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, మిరియాలగూడకు తరలిపోయాయి. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఎస్పీలు ఈ అక్రమ రవాణాపై దృష్టి సారించని పక్షంలో జిల్లాలో పేదలకు చౌక బియ్యం అందే అవకాశమే ఉండదనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
హద్దు దాటుతున్న అధికారుల అవినీతి ....
రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద అధికారులు డబ్బుకోసం హద్దుమీరి ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో నాగార్జునసాగర్, పొందుగల వద్ద సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి అధికారులు మాత్రం డబ్బులు తీసుకుని వాహనాలను చెక్ చేయకుండా పంపివేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొందరు అధికారులు ప్రైవేట్ వ్యక్తులను దళారులుగా ఏర్పాటు చేసుకుని వసూళ్లు చేస్తున్నారు.
ఇటీవల ఏసీబీ అధికారులు పొందుగల చెక్‌పోస్ట్‌పై దాడులు నిర్వహంచడంతో అక్కడి అవినీతి బాగోతం బయటపడింది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులకు తెలియనీయకుండా అక్కడి సిబ్బంది తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. రాత్రివేళ వారి ఆగడాలకు హద్దు లేకుండాపోతోంది. అక్రమ రవాణా రాత్రిపూటే అధికంగా జరుగుతుండటంతో వారి జేబులు నిండిపోతున్నాయి.
అసలు లక్ష్యం ఇది... రాష్ట్ర విభజన అనంతరం దాచేపల్లి మండలం పొందుగల, నాగార్జునసాగర్‌లోని విజయపురి సౌత్ వద్ద రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ రవాణ , కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, పోలీస్ తదితర శాఖలకు చెందిన సిబ్బందిని వాహనాల తనిఖీ కోసం ఏర్పాటు చేశారు. ఆయా వాహనాల రికార్డులు తనిఖీ చేయడంతో పాటు వాహనంలో వున్న సరుకును కూడా పరిశీలించాల్సి వుంది. అనుమానం వున్న వాహనాలను సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించాలి.
మితిమీరిన లోడుతో వచ్చే వాహనాలపై కేసులు నమోదు చేయాలి. ప్రభుత్వ పన్నుల వసూళ్లు చేపట్టాలి. అలాగే రాత్రింబవళ్ళు పటిష్ట నిఘా కొనసాగిస్తూ సమర్థంగా విధులు నిర్వహించాల్సి వు ంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరగడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నకిలీలు, మన జిల్లా నుంచి వెళ్లే బియ్యం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. అయితే ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
‘హద్దు’ మీరిన అక్రమం
Published Mon, Apr 6 2015 4:21 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement