రేషన్-ఆధార్ అనుసంధానం 94 శాతమే !
శ్రీకాకుళం పాతబస్టాండ్: రేషన్ కార్డులకు సంబంధించి ఆధార్ నంబర్ల అనుసంధానం చేసే ప్రక్రియ గడువు ఆదివారంతో ముగియనుంది. ఈ మేరకు రాష్ట్ర పభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఆదివారం నాటికి ఆధార్ సంఖ్యను ఆందజేయని రేషన్ కార్డు యూనిట్లను తొలగించి, శతశాతం ఆధార్ నమోదు లక్ష్యాలను చేరేందుకు అధికారులు సన్నద్ధమౌతున్నారు. మండల కార్యాలయాల్లోనూ, కలెక్టరేట్‌లోని కంప్యూటర్ టెక్నాలజీ సెంటర్‌లో పెద్ద ఎత్తున ఆధార్ అనుసంధాన కార్యక్రమంలో సివిల్ సప్లై ఆధికారులు బిజీ అయ్యూరు. అయితే పూర్తిస్థాయిలో ఆధార్ నంబర్ల అనుసంధానం జరగని కారణంగా జిల్లాలో పెద్ద ఎత్తున కార్డులతో పాటు సుమారుగా మూడు లక్షల యూనిట్లు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 220 మెట్రిక్ టన్నులు బియ్యం కూడా తగ్గనున్నాయి. ఈ ప్రభావం నిత్యవసర సరుకుల డీలర్లపై పడుతోందని వారు అందోళన చెందుతున్నారు.
జిల్లాలో ఈ ఏడాది జూన్ నెల నాటికి తెలుపు, అత్యోదయ, అన్నపూర్ణ, ర్యాప్, ట్యాప్ కార్డులు మొత్తం 7,79,562 ఉండేవి. ఆ కార్డులు సెప్టెంబర్ నాటికి 7,37,933 చేరాయి. అంటే ఈ మూడు నెలల్లో ఆధార్ అనుసంధానం, ఇతర కారణాల వల్ల సుమారుగా 31,629 కార్డులు వివిధ కారణాలవలన రద్దయ్యాయి. అలాగే కార్డులు ఉండి వాటిలో కొన్ని యూనిట్లకి ఆధార్ లేకపోవడంతో సుమారుగా మూడు లక్షల యూనిట్లు రద్దవుతున్నాయి. దీంతో భారీగా బియ్యం రేషన్‌లో కోత పడడం ఖాయం. ఈ పరిస్థితి డీలర్లకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. లబ్ధిదారులకు అందజేయలేక, ఒత్తిళ్లతో పాటు కార్డుదారుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న కార్డుల్లో 26,46,175 యూనిట్లు ఉన్నాయి.
ఈ యూనిట్లకు ఇప్పటి వరకు 22,46,480 యూనిట్లు అనుసంధానం జరిగాయి. ఇంకా ఆధార్ అనుసంధానం కాని, రిజక్టు చేసిన యూనిట్లు 2,99,695 రద్దుకానున్నాయి. దీంతో సుమారుగా నెల వారీ విడుదలైన బియ్యంలో 220 మెట్రిక్ టన్నుల బియ్యం సెప్టెంబర్ నెలకు తగ్గుతున్నాయి. అంటే సగటున ప్రతి డీలర్‌కి 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు బియ్యం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఉన్న బియ్యాన్ని పంపిణీ చేయడం డీలర్లకు సమస్యగా మారనుంది. కాగా ఇప్పటి వరకూ జిల్లాలో సగటున 94.05 శాతం యూనిట్లకి ఆధార్ నంబర్లను అనుసంధానం చేశారు. ఈ ప్రక్రియ ఆదివారంతో ముగియడంతో అనుసంధానం కాని యూనిట్లను తొలగించే అవకాశం ఉండడంతో లబ్ధిదారులు నష్టపోయే అవకాశం ఉంది.
ఇంకా విడుదల కాని సెప్టెంబర్ రేషన్
సెప్టెంబర్ నెల బియ్యం ఇంతవరకు ఒక్క డిపోకి కూడా విడుదల కాలేదు. ఈపీడీఎస్ విధానం అనుసరించడం, యూనిట్లు తగ్గించడంతో బియ్యం, ఇతర సరుకుల కోసం డీడీలు చెల్లించేందుకు డీలర్లు ముందుకు రావడంలేదు. ఇప్పటి వరకు డీలర్లకి ఆధార్ అనుసంధానం అనంతరం సవరించిన కీ రిజిస్టార్‌ను సంబంధిత ఆధికారలు అందజేయలేదు. అలాగే ఆధార్ లేక రద్దైన యూనిట్ల వివరాలతో కూడిన జాబితాను ఇవ్వలేదు. దీంతో డీలర్లు ఎమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. గతంలో తరువాత వచ్చే నెలకు సంబంధించి ముందుగానే 18వ తేదీ నాటికే డీడీలను కట్టేలా అధికారులు డీలర్లపై ఒత్తిడి చేసేవారు. అయితే ఈ నెల ఆధికారులు సకాలంలో కీ రిజిస్టార్లు అందజేయక ఇబ్బందులు పడుతున్నారు.