‘రచ్చబండ’ ద్వారా ప్రజలకు అండగా ఉంటామని ఊదరగొట్టిన ప్రభుత్వం.. ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.
గజ్వేల్, న్యూస్‌లైన్: ‘రచ్చబండ’ ద్వారా ప్రజలకు అండగా ఉంటామని ఊదరగొట్టిన ప్రభుత్వం.. ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. నాలుగు నెలల క్రితం ‘రచ్చబండ’ ద్వారా పంపిణీ చేసిన రేషన్ కార్డుదారులకు మార్చి నెల కోటాను నిలిపివేస్తూ షాక్‌నిచ్చింది. ఏళ్ల తరబడి నిరీక్షణ అనంతరం కార్డులు పొందిన పేదలకు ఈ పరిణామం శాపంగా పరిణమించింది. కుటుంబ సభ్యుల ఫొటోలను సమర్పించలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
జిల్లావ్యాప్తంగా డిసెంబర్ నెలలో 15వేల మందికి ‘రచ్చబండ’ ద్వారా రేషన్ కార్డుల కింద తాత్కాలిక కూపన్లను అందించారు. వీరికి 2వేల క్వింటాళ్లకుపైగా బియ్యం ఇతర వస్తువులు సరఫరా చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ కార్డులను పొందిన పేదలు సంతోషంలో మునిగిపోయారు. కానీ కుటుంబ సభ్యుల ఫొటోలను సమర్పించలేదనే కారణంతో ప్రభుత్వం కార్డుదారులకు ఎలాంటి సమాచారం లేకుండా మార్చినెల కోటాను నిలిపి వేశారు. ఈ మేరకు గ్రామాల్లోని రేషన్ డీలర్లకు వీరి కోటాను తగ్గించి సరుకులను పంపారు. ఈ పరిణామంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.
‘రచ్చబండ’ ద్వారా తమ కుటుంబానికి అండ లభిస్తుందనుకుంటే ఈ విధమైన చర్యలతో తమ ఆశలు నీరుగారుస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై డీఎస్‌ఓ (జిల్లా సరఫరా అధికారి) ఏసురత్నంను వివరణ కోరగా కుటుంబ సభ్యుల ఫొటోలను సమర్పించని కారణంగా ‘రచ్చబండ’ వినియోగదారులకు కోటా నిలిపివేసిన మాట వాస్తవమేనన్నారు. ఫొటోలు సమర్పించగానే కోటాను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు.