రవిప్రకాశ్‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు | Raviprakash was involved in Money Laundering | Sakshi
Sakshi News home page

రవిప్రకాశ్‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు

Published Tue, Oct 8 2019 4:17 AM | Last Updated on Tue, Oct 8 2019 4:21 AM

Raviprakash was involved in Money Laundering - Sakshi

సాక్షి, అమరావతి: టీవీ9 మాజీ సీఈవో వెలిచేటి రవిప్రకాశ్‌ అలియాస్‌ రవిబాబు రూ.వందల కోట్ల మేర మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, విదేశాల్లో పెద్దఎత్తున నల్లధనాన్ని దాచిపెట్టడంతో పాటు భారీ మొత్తంలో విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపేలా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థను(సీబీఐ) ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌కి తాజాగా లేఖ రాశారు. రవిప్రకాశ్, ఆయన భార్య దేవిక, ఇతరుల అక్రమార్జన, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలను కూడా జతచేసి సీజేఐకి పంపించారు. 

అడ్డగోలు సంపాదన 
‘‘ఎలక్ట్రానిక్‌ మీడియా వ్యాపారంలో ఉన్న రవిప్రకాశ్‌ తన పదవిని అడ్డం పెట్టుకుని బ్లాక్‌ మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడి పెద్ద మొత్తంలో డబ్బు, ఆస్తులను సంపాదించారు. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాల్లో దాచిపెట్టారు. ఇది మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(వీఎంఎల్‌ఏ), ఫారిన్‌ ఎక్సేంజ్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం(ఫెమా), ఆర్‌బీఐ నిబంధనలు, ఆదాయపు పన్ను చట్టంతో పాటు ఇతర చట్ట నిబంధనలకు విరుద్ధం. సానా సతీష్‌బాబుకు రవిప్రకాశ్‌ అత్యంత సన్నిహితుడు. సానా సతీష్, మొయిన్‌ ఖురేషీతో కలిసి బ్యాంకులను, ఎంఎంటీసీలను మోసం చేశారు. సానా సతీష్‌ను సీబీఐ, ఈడీలు ఇప్పటికే విచారిస్తున్నాయి. వీరంతా కూడా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించి, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి ఆ డబ్బును హవాలా మార్గంలో దేశం దాటించారు.

ముసద్దీలాల్‌ జ్యువెలర్స్‌కు చెందిన సుకేష్‌ గుప్తాతో కలిసి వీరంతా కూడా అక్రమ వ్యాపారాలు, కార్యకలాపాలు నిర్వహించారు. ఇలా ఎన్నో ఆస్తులను కూడబెట్టారు. అంతేకాక ఈ విధంగా సంపాదించిన డబ్బును హవాలా ద్వారా విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టారు. రవిప్రకాశ్‌కు పలు దేశాల్లో పలు రకాల చిరునామాలు, బ్యాంకు ఖాతాలున్నాయి. రవిప్రకాశ్, అతని భార్య దేవిక మీడియా ఎన్‌ఎక్స్‌టీ లిమిటెడ్‌లో చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇండో జాంబియా బ్యాంక్‌లో ఖాతా కూడా ఉంది. ఈ వివరాలను కూడా వీరు బహిర్గతం చేయలేదు. జాతి ప్రయోజనాలను ఆశించి ఈ ఫిర్యాదు చేస్తున్నా. ఈ ఆధారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రవిప్రకాశ్, అతని భార్య దేవిక, ఇతర సహాయకుల అక్రమాలు, అక్రమార్జనపై ఈడీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అభ్యర్థిస్తున్నా’’ అని తన లేఖలో కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement