సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రంలో లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు వివరించారు. భన్వర్‌లాల్ శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోను, ఆ తరువాత గవర్నర్‌తోను సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు.
అలాగే ఎన్నికల నిర్వహణకు బడ్జెట్ నిధులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి తొలుత రూ.150 కోట్లు విడుదల చేయాల్సిందిగా కోరారు. ఎన్నికల నిర్వహణకు మొత్తంరూ. 800 కోట్ల వ్యయం అవుతుండగా ఇందులో సగం రాష్ట్ర ప్రభుత్వం, మిగతా సగం కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి అనుగుణంగా ప్రతిపాదనలను పంపారు. ఇలా ఉండగా లోక్‌సభ తోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈ నెల 3 లేదా 4వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమైనా మిగిలి ఉంటే అందుకు రెండు మూడు రోజుల సమయం అవసరమైతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనను 6వ తేదీ లేదా 7వ తేదీకి కమిషన్ వాయిదా వేయవచ్చునని అధికార వర్గాలు తెలిపాయి. లేని పక్షంలో 3 లేదా 4వ తేదీనే షెడ్యూల్‌ను కమిషన్ ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికలు?
గత రెండు సాధారణ ఎన్నికల్లానే ఈసారి కూడా రాష్ట్రంలో రెండు విడతల్లో పోలింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో జరిగే సాధారణ ఎన్నికల షెడ్యూలు విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తిచేసింది.
2004లో ఇలా..
షెడ్యూలు విడుదల: ఫిబ్రవరి 29
పోలింగ్ తేదీలు: ఏప్రిల్ 20, 26,
మే 5, 10
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్: ఏప్రిల్ 20, 26
ఓట్ల లెక్కింపు: మే 13
2009లో ఇలా..
షెడ్యూలు విడుదల: మార్చి 2
పోలింగ్ తేదీలు: ఏప్రిల్ 16, 23, 30,
మే 7, మే 13
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్: ఏప్రిల్ 16, 23
ఓట్ల లెక్కింపు: మే 16
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం
Published Sun, Mar 2 2014 3:50 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement