ఓటర్ల గుర్తింపు సర్వే షురూ | ready to the survey of voters | Sakshi
Sakshi News home page

ఓటర్ల గుర్తింపు సర్వే షురూ

Published Mon, Dec 8 2014 2:46 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

ready to the survey of voters

తిరుపతి కార్పొరేషన్: కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు కార్పొరేషన్‌లోకి ఎం ఆర్‌పల్లి, రాజీవ్‌నగర్, తిమ్మినాయుడుపాలెం పంచాయతీలను విలీనం చేసి జనాభాను నగర పాలక సంస్థలోని 50 డివిజన్లలోనే సర్దుబాటు చేసింది. తద్వారా ఆయా డివిజన్ల సరిహద్దులు గుర్తించడం, జనాభా సర్దుబాటు వంటి కీలక ఘట్టాలను పూర్తి చేసింది. దీంతో అధికారిక లెక్కల ప్రకారం నగరపాలక సంస్థ పరిధిలోని జనాభా 3,74,260 మందికి చేరుకుంది.

పురుషులు 1,87,931 మంది, మహిళలు 1,86,329 మందిగా గుర్తించారు. ప్రస్తుతం సర్దుబాటు చేసిన 50 డివిజన్ల జనాభా నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారీగా ఓటర్ల గణనను పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 10 నుంచి 26వ తేదీ వరకు మూడు కులాల గణన పూర్తి చేయాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలనాధికారి సాంబశివరావు ఈ నెల ఆరో తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.
 
మొదట ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గుర్తింపు ..

నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు. అందులో అర్హులైన ఓటర్లు ఎంత మంది ఉన్నారో లెక్కలు తీసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈనెల పదో తేదీ నుంచి 19 తేదీ వరకు ఇంటింటా సర్వే నిర్వహించి ఓటర్లను గుర్తిస్తారు. 20 నుంచి 21వ తేదీ వరకు ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారు. 22న తుది జాబితాను ప్రకటిస్తారు. అభ్యంతరాలను 26వ తేదీ వరకు స్వీకరిస్తారు. అభ్యంతరాలపై 27వ తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు పరిశీలిస్తారు. జనవరి నాలుగో తేదీన తుది జాబితాను ప్రకటించి ప్రభుత్వానికి పంపించనున్నారు.
 
పది నుంచి బీసీ ఓటర్ల గుర్తింపు..

ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గుర్తింపు తరహాలోనే నగర పాలక సంస్థ పరిధిలోని బీసీ ఓటర్ల గుర్తింపును చేపట్టనున్నారు. ఈనెల పదో తేదీ నుంచి 26వ వరకు ఇంటింటా నిర్వహిస్తారు. 27,28 తేదీల్లో జాబితాను సిద్ధం చేసి 29వ తేదీన ప్రకటిస్తారు. 30వ తేదీ నుంచి జనవరి రెండో తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జనవరి మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను పరిశీలిస్తారు. పదో తేదీ నుంచి 13వ తేదీ నుంచి  క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు. జనవరి 17న తుది జాబితాను ప్రభుత్వానికి పంపిస్తారు. తద్వారా ఫిబ్రవరిలో తిరుపతి కార్పొరేషన్‌కు నిర్వహించాలనుకుంటున్న ఎన్నికలకు వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్‌లను ప్రభుత్వం ప్రకటించనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement