పేరు మార్చి అగ్రిమెంట్లు
రూ.లక్షల్లో వసూళ్లు
భూములు చూపించి అమ్మకాలు
లబోదిబో మంటున్న బాధితులు
శ్రీకాకుళం టౌన్: శ్రీకాకుళం జిల్లాలో రియల్ వ్యాపారం లబ్ధిదారులను నిలువునా ముంచేసింది. రూ.కోట్లు కొల్లగొట్టిన రియల్టర్లు తప్పుడు ఒప్పందాలు చేపట్టి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. పదేళ్ల క్రితం కొనుక్కున్న వారు ఇప్పుడు ఇళ్లు కట్టుకుందామని వెళితే అక్కడ స్థలం నాదంటూ ఇంకొకరు ప్రత్యక్షమవుతున్నారు. మరికొన్ని చోట్ల ఇప్పటికీ అగ్రిమెంట్లతోనే రూ.లక్షలు కాజేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్‌కు రమ్మంటే రావడం లేదు. దీంతో ఇప్పుడు పోలీసుస్టేషన్లకు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చి చేరుతున్నాయి. పోలీసులు మాత్రం ఇరువైపులా చేతులు చాపి సివిల్ పంచాయతీలను గాలిలో వదిలేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సాగుతున్న ఈ వ్యవహారంపై ఎవరికి చెప్పాలో తెలియక బాధితులు తలలు పట్టుకొంటున్నారు. అలా మోసపోయిన బాధితుల్లో శ్రీగృహ వెంచర్ బాధితులు ఉన్నారు.
జిల్లాలోని ఎచ్చెర్ల నియోజక వర్గంలో గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాయని సూర్యనారాయణ రెడ్డి శ్రీసాయిలక్ష్మి రియల్ ఎస్టేట్ పేరుతో శ్రీకాకుళం మండలం చింతాడ రెవెన్యూ గ్రూప్ పరిధిలోని సర్వే నెంబరు 179/4, 5, 6, 7, 8, 9, 10, 11, 209/14, 17, 30, 178/2, 2బి, 210/5, 6, 7, 8, 180/1లలో 10.86 ఎకరాల స్థలంలో వెంచర్ ఏర్పాటు చేశారు. ఈ భూములను రైతుల నుంచి వేర్వేరు వ్యక్తుల పేరుతో కొనుగోలు చేసిన యాజమాన్యం డెవలప్‌మెంట్ బాధ్యతలను తాము చేపట్టినట్టు చూపిస్తూ వెంచర్‌ను ప్రారంభించారు. వందగజాలు రూ.1.50 లక్షలుగా ధర నిర్ణయించి విక్రయాలు ఆరంభించారు. 308 ప్లాట్‌లుగా విభజించి వెంచర్ అమ్మకాలు ప్రారంభించిన సంస్థ అమ్మకాలు పూర్తికాకుండానే మూతపడింది. ఆ సమయంలో 2009 ఎన్నికలు రావడంతో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి సంస్థ యజమాని సూర్యనారాయణరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సూర్యనారాయణరెడ్డి అరెస్ట్ అయ్యూరు. ఇదే అదునుగా సాయిలక్ష్మి రియల్టరు వద్ద పనిచేసిన ఉద్యోగులు శ్రీగృహ పేరుతో అదే స్థలాన్ని విక్రయించడానికి సిద్ధమయ్యారు. డెవలపర్స్, స్థల యజమానుల మధ్య వివాదం తలెత్తిన సమయంలోనే కొత్తగా ఆరంభమైన శ్రీగృహ హౌసింగ్ ప్రాజెక్ట్స్ సంస్థ 308 పాట్లను తిరిగి విక్రయించడానికి సిద్ధమయ్యారు.
సుభద్రాపురం వద్ద మరో వెంచర్
శ్రీగృహ నిర్వాహకులు తాండ్ర వెంకటబాబు, మహేష్‌బాబు స్థానికంగా తనకు, ఉపాధ్యా వృత్తిలో ఉన్న తన తండ్రి పరిచయాలను దృష్టిలో ఉంచుకొని వెంచర్ విక్రయానికి సిద్ధమయ్యారు. స్నేహితులు, బంధువులు, సమీప గ్రామాల్లో ఉన్న వారిని, సీమెన్‌లు, ఇతర ఉద్యోగులను రంగంలోకి దింపి వారి నుంచి అడ్వాన్సులు తీసుకొని అగ్రిమెంట్లు కట్టారు. పేడాడ పార్వతి, బెండి తులసీరావు, పొన్నాడ రామారావు, వావిలపల్లి అమ్మినాయుడు, పూజారి ఉషాకుమారి, మామిడి శ్రీనివాసరావు ఇలా ఎంతో మందికి స్టాంపు పేపర్లపైనే అగ్రిమెంట్లు ఇచ్చారు. అగ్రిమెంట్ల రూపంలో వెంకటబాబు, మహేష్‌బాబు తీసుకున్న మొత్తాలను లావేరు మండలం సుభద్రాపురం వద్ద మరో వెంచర్ డెవలపింగ్‌నకు అడ్వాన్సులు ఇచ్చారు.
వేరొకరిపేరుతో భూమి
చింతాడ వద్ద వేసిన వెంచరులో భూమి వేరొకరిపేరుతో ఉండడం వల్ల డెవలపర్స్‌గా అగ్రిమెంటు చేసిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయలేక చేతులెత్తేశారు. డబ్బులిచ్చిన అగ్రిమెంటు దారులు ఇప్పుడు స్థలంలేక చేతిలో ఉన్న డబ్బులు పోగొట్టుకొని లబోదిబో మంటున్నారు. గత నెలలో బాధితులంతా శ్రీకాకుళం పట్టణ సీఐ దాడి మోహనరావును ఆశ్రయించారు. బాధితులను, అగ్రిమెంటు చేసిన వ్యక్తులను పిలిపించి సెటిల్ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆమదాలవలస ప్రాంతానికి చెందిన అధికార పార్టీ పెద్దల నుంచి ఫోన్ రావడంతో కథకంచికి చేరింది. ఇప్పుడు స్థలం లేక చేతిలో డబ్బులు పోగొట్టుకొని ఆవేదన చెందుతున్నారు. ఇక ఆ డబ్బుల వసూళ్ల సంగతి దేవునికే ఎరుక..
సీఐ ఏమంటున్నారంటే...
తాండ్ర వెంకటబాబు, మహేష్ బాబులపై కొందరు బాధితులు ఫిర్యాదు చేశారని సీఐ దాడి మోహనరావు చెప్పారు. ఇందులో భాగంగా బాధితులు, డబ్బులు తీసుకున్న వారిని పిలిపించి మాట్లాడినట్టు తెలిపారు. కేసు విచారణలో ఉందన్నారు.
‘రియల్’ మాయ
Published Mon, Mar 14 2016 12:26 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM
Advertisement
Advertisement