అమరావతిలో ప్లాట్లుగా మారిన పంట పొలాలు
ఏపీ రాజధానిపై ప్రభుత్వ పెద్దల ప్రకటనల ఫలితం
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం పేరిట కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున రియల్ దందా సాగుతోంది. కొందరు పనిగట్టుకుని సాగిస్తున్న ఈ వ్యవహారంలో రైతులు, సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. మాగాణి భూములన్నీ రియల్టర్లు, బ్రోకర్ల చేతిలో ఇరుక్కుపోతున్నాయి. వీరివెనుక బడా నేతలు ఉన్నారు. నేరుగా రంగంలోకి దిగితే ఇబ్బం దులు పడుతామని భావిస్తున్న ఈ నేతలు రియల్టర్ల ద్వారా తతంగం కానిస్తున్నారు. బడా నేతలు, వారి అనుచురులు రియల్టర్ల ద్వారా నామమాత్రపు అడ్వాన్సులు చెల్లించి రైతుల భూములను తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలు రాష్ట్ర, కేంద్ర మంత్రుల నుంచి తరచూ రాజధానిపై రకరకాల ప్రకటనలు వెలువడుతున్నాయి. అవన్నీ కృష్ణా, గుంటూరు జిల్లాలను కేం ద్రంగా చేసుకుని వెలువడుతున్నవే కావడం గమనార్హం. రాజ ధాని అక్కడే అంటూ పత్రికల్లో వెలువడుతున్న కథనాలు వారి ప్రకటనలకు తోడవుతున్నాయి. ఇంకేముంది అక్కడే అసెంబ్లీ, ఇక్కడే సచివాలయం అంటూ తెల్లారేసరికే రంగు రంగుల కరపత్రాలు రోడ్లపైకి వస్తున్నాయి. ‘రాష్ట్ర రాజధాని విజయవాడ - గుంటూరు నగరాల మధ్య ఉండొచ్చు. రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతం అనుకూలం...’ నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన ప్రకటనల సారాంశం ఇది. దీంతో ఈ రెండు నగరాల మధ్య భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. విజయవాడ, గుంటూరు నగర శివారుల్లోని స్థలాల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి.
‘అమరావతి’ ప్రచారంతో రియల్టర్లలో ఆందోళన...
గుంటూరు జిల్లా అమరావతి కేంద్రంగా రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయంటూ ఒక దినపత్రిక ప్రచురించిన ప్రత్యేక కథనంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. దీంతో ఏలూరు - గన్నవరం - విజయవాడ - మంగళగిరి ప్రాంతాల ప్రజల్లో కలకలం సృష్టిం చింది. ఇక్కడ భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. అంతకు పూర్వం ఈ ప్రాంతాల్లో అత్యధిక ధరలకు పొలాలు కొనుగోలు చేసిన రియల్టర్లు, ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ రాజధాని ఏర్పాటు కాకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. మూడు రోజులుగా భూములు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
ఆ ప్రాంతంలోనూ భూముల ధరలకు రెక్కలు...
మరోవైపు.. అమరావతి, తాడికొండ, అచ్చంపేట, కృష్ణా జిల్లా నందిగామ, కంచికచర్ల, గొల్లపూడి ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. నదికి అటువైపున కృష్ణా జిల్లాలోని ప్రాంతాలను కలుపుతూ భారీ వంతెనలను నిర్మించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని ఆ ప్రత్యేక కథనంలో పేర్కొనడటంతో రెండు వైపులా వ్యవసాయ భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి.