![Avanthi Srinivas Slams On Chandrababu Over Capita Amaravati - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/18/avanti-srinivas.jpg.webp?itok=1nqibjE5)
సాక్షి, కృష్ణా: గ్లోబల్స్ ప్రచారంతో అపోహలు సృష్టించి, అశలు కల్పించి చంద్రబాబు మళ్లీ రైతులను వంచిస్తున్నాడని మంత్రి అవంతీ శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర భిక్షతో గతంలో చంద్రబాబు సీఎం అయిన సంగతి మర్చిపోయాడని అవంతీ శ్రీనివాస్ దుయ్యబట్టారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేసి కొన్న భూముల ధరలు తగ్గిపోతాయని.. చంద్రబాబు అమరావతి డ్రామా మొదలుపెట్టాడని ఆయన ధ్వజమెత్తారు. విశాఖ రాజధాని వద్దనుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ప్రజలు ఇచ్చేతీర్పును రెఫరెండంగా తీసుకోవాలని అవంతీ శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచకాలు, అశాంతి రాజేస్తూ.. చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
చదవండి: అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ సంకల్పం
చంద్రబాబు డ్రామాలో భాగంగానే పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తుపెట్టుకున్నాడని అవంతీ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బీజేపీనేత సుజనా చౌదరి తెలిసీ తెలియని వ్యాఖ్యలు చేస్తున్నారని అవంతీ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే కుట్ర వల్ల చంద్రబాబుతో పాటు ప్రజలూ నష్టపోతారని అవంతీ శ్రీనివాస్ గుర్తుచేశారు. హైదరాబాద్ లాంటి పరిస్థితి రాకూడదనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నిప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తున్నారని ఆయన తెలిపారు. వైఎస్ కుటుంబం రైతుపక్షపాతి అని.. రైతులకు అన్యాయం చేసే కుటుంబం కాదని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ జనం మనిషిగా ఎదగటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని.. అందుకే దుర్మార్గపు ఎత్తుగడలతో దుష్ట పన్నాగాలు పన్నుతున్నాడని మంత్రి అవంతీ శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment