రిజిస్ట్రేషన్లపై మళ్లీ ‘సమ్మె’ట
Published Sun, Jan 19 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
సాక్షి, కాకినాడ :స్థిరాస్తి రిజిస్ట్రేషన్లను ‘మీ సేవ’కు బదిలీ చేయబోమంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోకపోవడాన్ని నిరసిస్తూ దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు శనివారం నుంచి మళ్లీ సమ్మె బాటపట్టారు. వారు నిరవధిక సమ్మెకు దిగడంతో జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గతనెల 26, 27, 28 తేదీల్లో 72 గంటల సమ్మె చేసిన లేఖర్లు, వెండర్లు స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల బదిలీని విరమించుకుంటామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి తోట నరసింహం హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు. దస్తావేజు నకళ్లు (సీసీలు), ఎంకంబరెన్స్ సర్టిఫికెట్లు(ఈసీ) జారీ బాధ్యతలను మీ సేవ నుంచి గతంలో మాదిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు అప్పగించాలని కూడా దస్తావేజు లేఖర్ల సంఘం డిమాండ్ చేసిం ది. దాంతో ప్రభుత్వం మీ సేవతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా సీసీలు, ఈసీలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తర్వాత ఆ ఉత్తర్వును రద్దు చేస్తూ, మీ సేవ ద్వారానే సీసీలు, ఈసీలు జారీ చేయాలన్న గత ఉత్తర్వులనే కొనసాగిస్తూ ఈ నెల 16న సర్క్యులర్ జారీ చేసింది.
స్టాంపుల అమ్మకాలూ లేవు..
సమ్మెతో కాకినాడ, రాజమండ్రి రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలోని 32 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూతపడ్డాయి. భూముల కొనుగోలు, అమ్మకాలే కాదు.. చివరకు స్టాంపుల విక్రయాలు కూడా నిలిచిపోయాయి. భూ రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే రూ.కోటిన్నర ఆదాయానికి గండిపడింది. రూ.30 కోట్ల వరకు లా వాదేవీలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ కా ర్యాలయాలు తెరిచినా రిజిస్ట్రార్లు తప్ప సిబ్బంది కూడా కనిపించలేదు. లేఖర్లు, వెండర్లు కార్యాలయాల గేట్లకు తాళాలు వేయడంతో క్రయ, విక్రయదార్లతో పాటు సిబ్బంది కూడా లోనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల కలిగే దుష్పరిణామాలను లేఖరులు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారికి వివరించారు.
Advertisement
Advertisement