
కోకో గింజలకు రికార్డు ధర
పెరవలి, న్యూస్‌లైన్ : కోకో గింజలకు మార్కెట్‌లో మంచి గిట్టుబాటు ధర లభిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కోకో గింజలు రూ.160 పలుకుతున్నాయి. 2010లో కిలో కోకో గింజలు రూ.120 పలకగా 2011లో రూ.165, 2012లో రూ.140 పలికాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే రూ.160 ధర పలకడంతో రైతులు మరింత పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దిగుబడి ఉన్నా గిట్టుబాటు ధర లభించేది కాదని, కొనుగోలు కేంద్రాలు కూడా అంతంతమాత్రంగా ఉండటంతో కేంద్రాలు నిర్ణయించిన ధరలకే అమ్ముకోవాల్సి వచ్చేదని రైతులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు పెరిగి పోటీ ఏర్పడడంతో నాణ్యమైన గింజలను అధిక ధరలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో ధర మార్చి, ఏప్రిల్‌లో పెరుగుతుందని ఈసారి డిసెంబర్‌లోనే పెరగడంతో రాబోయే రోజుల్లో కిలో రూ.200పైనే కొనుగోలు చేస్తారని రైతులు భావిస్తున్నారు. పెరవలి మండలంలో కోకో సాగు నానాటికీ విస్తరిస్తోంది. ప్రస్తుతం తీపర్రు, కానూరు, నడిపల్లి, అజ్జరం, కాకరపర్రు, ముక్కామల గ్రామాల్లో 110 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ధరలు మరింతగా పెరిగితే మూడేళ్లుగా నష్టాలను ఎదుర్కొంటున్న రైతులకు ఊరట లభిస్తుందని పేర్కొంటున్నారు.