రాష్ట్ర విభజనకు లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో జిల్లాలో పోలీసు శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో జిల్లాలో పోలీసు శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కర్నూలు, డోన్, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని పట్టణాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఆవేశంతో అదుపు తప్పితే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందనే నిఘా వర్గాల హెచ్చరికతో సబ్ డివిజన్ల వారీగా పోలీసు అధికారులు ఉద్యోగ, ఉపాధ్యాయ విద్యార్థి జేఏసీలతో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం ఎస్పీ రఘురామిరెడ్డి అన్ని సబ్ డివిజన్ల పోలీసు అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు. అవసరమైతే లాఠీచార్జి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులతో పాటు జాతీయ నేతల విగ్రహాల ధ్వంసానికి పాల్పడితే కేసులు నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం రెండు సీఆర్‌పీఎఫ్, ఒక బీఎస్‌ఎఫ్, ఒక ఏపీఎస్పీ కంపెనీ బలగాలు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నాయి. ఉద్యమాలకు మళ్లీ సిద్ధమవుతున్న రాజకీయ పక్షాలు, ఉపాధ్యాయ, విద్యార్థి జేఏసీ కదలికలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు, ఆస్తుల పరిరక్షణకు ఒక కంపెనీ సీఆర్‌పీఎఫ్ బలగాలను కేటాయించారు.
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఇంటి వద్ద ఆయన లేకపోయినప్పటికీ కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. రాష్ట్ర చిన్న తరహా నీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్‌కు చెందిన హోటల్, ఇళ్లు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భద్రతను మరింత పెంచారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ నేతల విగ్రహాల వద్ద పికెట్లను ఏర్పాటు చేశారు. ప్రతి పికెట్ వద్ద ఒక సెక్షన్ పారా మిలిటరీ సిబ్బందితో స్పెషల్ పార్టీ పోలీసులు, స్థానిక పోలీసులను బందోబస్తు విధులకు నియమించారు.
కర్నూలులో డీఎస్పీ మనోహర్‌రావు పర్యవేక్షణలో నగర ప్రధాన రహదారుల్లో పోలీసుల బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. రాయలసీమ యూనివర్సిటీ, కలెక్టరేట్, మౌర్య ఇన్, రాజ్‌విహార్ సెంటర్, కాంగ్రెస్ కార్యాలయం, కృష్ణదేవరాయల సర్కిల్, నంద్యాల చెక్‌పోస్టు, రాజీవ్‌గాంధీ సర్కిల్, టీడీపీ కార్యాలయం, చెన్నమ్మ సర్కిల్ తదితర ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి బందోబస్తును కట్టుదిట్టం చేశారు. నగర నడిబొడ్డు రాజ్‌విహార్ సెంటర్‌లో డీఎస్పీ మనోహర్‌రావు తిష్ట వేసి అన్ని ప్రాంతాల్లోని పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ బందోబస్తును కట్టుదిట్టం చేశారు.
హింసకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు: ఎస్పీ
రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమాల పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను, జాతీయ నేతల విగ్రహాలను ధ్వంసం చేస్తే సంబంధిత వ్యక్తులపై ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్-2 పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రఘురామిరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలు తమ నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా జరుపుకోవాలి తప్పా హింసాత్మక సంఘటనలకు పాల్పడరాదని సూచించారు. ఆందోళన కార్యక్రమంలో విద్యార్థులు ఎక్కువగా పాల్గొంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హింసాత్మక సంఘటనల్లో పాల్గొనే విద్యార్థులపై కేసులు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలు, పాస్ పోర్టు వంటివి రావడం కష్టమని ఎస్పీ హెచ్చరించారు. ఆందోళనలు, ర్యాలీలను వీడియో ద్వారా చిత్రీకరిస్తామన్నారు.