ఒట్టిమాటలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామని సీఎం చంద్రబాబు, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేస్త్తున్న ప్రకటనలు ‘ఉత్త’రకుమార ప్రగల్భాలను తలపిస్తున్నాయి. మూణ్ణెళ్ల పరిధిలో శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలిస్తున్న 412 టన్నుల ఎర్రచందనం దుంగలను అటవీ, పోలీసుశాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడమే అందుకు తార్కాణం. అంతకు రెట్టింపు స్థాయిలో ఎర్రచందనాన్ని పోలీసులు, అటవీశాఖ అధికారుల కళ్లు గప్పి సరిహద్దులు దాటించారని అధికారవర్గాలే పేర్కొంటుండడం గమనార్హం.
ఏడుకొండలస్వామి కొలువైన శేషాచలం కొండల్లో ఎర్రచందనం వృక్షాలు విస్తారంగా విస్తరించాయి. జాతీయసంపద అయిన ఎర్రచందనం వృక్షాలను స్మగ్లర్లు అడ్డంగా నరికేస్తూ.. దేశ సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులపై ఎర్రచందనం కూలీలు దాడిచేసి.. ఇద్దరిని హతమార్చారు. స్మగ్లర్లను అణచివేయడం.. ఎర్రచందనం వృక్షసంపదను పరిరక్షించడం కోసం జూన్ 25, 2013న అప్పటి ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. 16 నెలల కాలంలో ఎర్రచందనం కూలీలు.. పోలీసు, అటవీశాఖ అధికారుల మధ్య చోటుచేసుకున్న దాడుల్లో ఎనిమిదిమంది కూలీలు, ఇద్దరు అధికారులు మృతి చెందారు.
దేశ, విదేశాల్లోని 196 మంది ఎర్రచందనం స్మగ్లర్లను గుర్తించిన పోలీసులు.. ఇప్పటిదాకా 172 మందిని అరెస్టు చేశారు. ఎర్రచందనం వృక్షాలను నరుకుతున్న 633 మంది తమిళనాడుకు చెందిన కూలీలను అరెస్టు చేశారు. మొత్తమ్మీద 805 మంది స్మగ్లర్లు, కూలీలు రాజమండ్రి సెంట్రల్ జైల్‌తోపాటు చిత్తూరు, కడప జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఎర్రచందనం వృక్ష సంపదను పరిరక్షించడం కోసం ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) సహకారంతో శాటిలైట్‌తో నిఘా వేయిస్తామని అనేక సందర్భాల్లో సీఎం చంద్రబాబు, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రకటించారు.
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం వృక్షాలు దట్టంగా ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి.. వాటిని అనుసంధానం చేసి నిఘా వేస్తామని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మూడు నెలల క్రితమే ప్రకటించారు. అడవుల్లో నుంచి ఒక్క ఎర్రచందనం దుంగను కూడా తరలిపోనివ్వమని పదే పదే ప్రకటనలు జారీచేశారు. కానీ.. అవన్నీ ఒట్టివేనని తేలిపోయింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల పరిధిలోనే స్మగ్లర్లు తరలిస్తోన్న 412 టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు, అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అంతకు రెట్టింపు స్థాయిలో ఎర్రచందనం దుంగలను పోలీసుల కన్నుగప్పి దేశ సరిహద్దులు దాటించారని అటవీశాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. శేషాచలం అడవుల్లో శాటిలైట్ నిఘా కోసం ఇప్పటిదాకా ఇస్రోను ప్రభుత్వం సంప్రదించకపోవడాన్ని బట్టి చూస్తే.. సీఎం చంద్రబాబు ప్రకటనలకు చేతలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదన్నది స్పష్టమవుతోంది. ఎర్రచందనం వృక్షాలు దట్టంగా ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రతిపాదన ఇప్పటికీ కాగితాలకే పరిమితమైంది.
చిత్తూరు జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో టీడీపీ నేతలుగా చెలామణి అవుతోన్న 39 మంది ఁఎర్ర*దొంగలను అరెస్టు చేయడంలో పోలీసులను ఏ అదృశ్యశక్తి అడ్డుకుంటోందన్నది సీఎం చంద్రబాబుకే ఎరుక..! ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన కుదరకపోవడం వల్ల ఁఎర్ర*దొంగలు రెచ్చిపోతున్నారు. రోజూ శేషాచలం అడవుల్లో ఎర్రచందనం వృక్షాలను నరుకుతూ.. దుంగలను సరిహద్దులు దాటిస్తోండటం గమనార్హం.