‘ఎర్ర’ స్మగ్లర్లను అరికట్టేందుకు సహకరిస్తాం
సాక్షి, తిరుమల: ‘‘తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ శేషాచల అడవుల్లో ఉన్న అపారమైన ఎర్రచందనం కలపను అక్రమార్కులు దోచుకుపోతున్నారు. అలాంటి వారి ఆగడాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది.’’ అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇదే విషయంపై గతంలో కేంద్ర స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా శేషాచలం ఎర్రచందనాన్ని కాపాడాలని కోరానని తెలిపారు.
శనివారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. తిరుమల పవిత్రత, ప్రశాంతతను కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. తనకు మహద్వారం ద్వారా వెళ్లే అవకాశం ఉన్నా.. క్యూలోనే వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నానని తెలిపారు. తమ ఇలవేల్పు అయిన శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. వాజ్‌పేయి, నరేంద్రమోడి ప్రధానులు కావాలని గతంలోనే కోరుకున్నానని, ఆ కోరికను స్వామివారు తీర్చారన్నారు.
ప్రస్తుతం విడిపోయిన తెలుగు రాష్ట్రాలు అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ప్రార్థించినట్టు తెలిపారు. నరేంద్రమోడి ప్రధానమంత్రి కావడంతో దేశానికి మంచిరోజులు వచ్చాయని చెప్పారు. భారత్ ముందున్న అనేక సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు నరేంద్రమోడి అని కొనియాడారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తిరుపతి అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తానని వెంకయ్యనాయుడు తెలిపారు. ఆయన వెంట తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ, చదలవాడ కృష్ణమూర్తి, బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి ఉన్నారు. అంతకు ముందు చైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు మంత్రికి ప్రత్యేక దర్శనాలు చేయించి లడ్డూ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందజేశారు.