9వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి
హీర: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా అందలేదని శ్రీకాకుళం జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి మండిపడ్డారు. జూలై 18న ఎంపీ రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు వచ్చి నిర్వాసితులకు అండగా ఉంటామని, ప్యాకేజిలు ఇస్తామని ప్రకటించారని, అయితే ఇంతవరకు ఎవరికీ ఏమీ అందలేదని ఆమె తెలిపారు.
ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలిచేందుకు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా హిర లో నిర్వహించిన సభలో రెడ్డి శాంతి మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీకాకుళం జిల్లా రైతుల కోసం వంశధార ప్రాజెక్టును తీసుకొచ్చారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ మరణం తరువాత 9 వేల కుటుంబాలకు చెందిన నిర్వాసితులు రోడ్డున పడ్డారన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ తరఫున గెలిచిన కలమట వెంకటరమణ నమ్మకద్రోహం చేసి అన్నం పెట్టే చేతినే నరికేశారని విమర్శించారు. నిర్వాసితులకు న్యాయం చేస్తానని వెళ్లిన కలమట వెంకటరమణ ఇసుక దందా చేసి కోట్ల రూపాయలు కూడబెట్టారన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా వదలకుండా నీరు, చెట్టు, పుట్ట, గట్టు.. అన్నింట్లో తినేశారని విమర్శించారు. ఒక పార్టీ నుంచి గెలిచినవారిని కొనుక్కున్న పార్టీని భూస్థాపితం చేయాలి అని ఆమె పిలుపునిచ్చారు.