రూ.800 కోట్లు దారి మళ్లింపు!  | Redirection of Rs 800 crore from Ritwik Private Limited Company | Sakshi
Sakshi News home page

రూ.800 కోట్లు దారి మళ్లింపు! 

Published Sat, Oct 20 2018 3:55 AM | Last Updated on Sat, Oct 20 2018 7:52 AM

Redirection of Rs 800 crore from Ritwik Private Limited Company - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ అక్రమ లావాదేవీలు, బినామీ వ్యవహారాలను ఆదాయపన్ను శాఖ రట్టు చేసింది. సబ్‌ కాంట్రాక్టుల ముసుగులో పనులు చేయకుండానే చేసినట్లుగా చూపించి బిల్లులు కాజేయటం, ఆ డబ్బులను చిరునామా లేని కంపెనీల్లోకి మళ్లించి తరువాత వాటి నుంచి సీఎం రమేశ్‌ సంస్థ నగదు వెనక్కి తీసుకున్నట్లు ఐటీ అధికారులకు కచ్చితమైన ఆధారాలు లభ్యమయ్యాయి. గత వారం రోజులుగా ఆదాయపన్ను శాఖ సోదాల్లో సేకరించిన కీలక ఆధారాలను బట్టి సీఎం రమేశ్‌కు చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్‌ ప్రాజెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సుమారు రూ.800 కోట్లను వివిధ కంపెనీల ద్వారా దారి మళ్లించిందని ప్రాథమికంగా నిర్థారించినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.100 కోట్ల మళ్లింపుపై పూర్తి ఆధారాలు లభించగా మరో రూ.700 కోట్ల మేరకు అనుమానాస్పద లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారు. 

యువనేత సన్నిహిత కంపెనీకి నిధుల వరద
అధికార పార్టీకి చెందిన కీలక యువనేతతో దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా ప్రచారంలో ఉన్న ఓ సాంప్రదాయ ఇంధన తయారీ రంగంలోని కంపెనీలోకి ఈ రూ.700 కోట్లను సీఎం రమేష్‌ సంస్థ తరలించినట్లుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. సీఎం రమేష్‌కు చెందిన కంపెనీలు అంజనాద్రి పవర్, కడప పవర్, నారాయణాద్రి గ్రీన్‌ఎనర్జీ, కదిరి గ్రీన్‌పవర్, రిత్విక్‌ గ్రీన్‌పవర్‌ల నుంచి ప్రవాహంలా నిధులను ఈ సంప్రదాయ ఇంధన తయారీ కంపెనీలోకి తరలించినట్లు భావిస్తున్నారు.

చిరునామా లేని కంపెనీలకు రూ.వంద కోట్లు తరలింపు
సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ సంస్థ సుమారు రూ.100 కోట్లను నకిలీ కంపెనీల పేరుతో తరలించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రూ.74 కోట్లను చిరునామా లేని కంపెనీల్లోకి తరలించగా మరో రూ.25 కోట్లను అనుమానాస్పద లావాదేవీలుగా గుర్తించినట్లు ఐటీ శాఖ రూపొందించిన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా సబ్‌కాంట్రాక్టుల ముసుగులో భారీఎత్తున నిధులను దారి మళ్లించినట్లు తేలింది. గత ఆరేళ్లలో ఎడ్కో(ఇండియా) అనే సబ్‌కాంట్రాక్టర్‌కు రూ.12 కోట్లు చెల్లించినట్లు పుస్తకాల్లో చూపించగా రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో ఎక్కడా ఈ కంపెనీ ఆనవాళ్లు లభించలేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. 

రిత్విక్‌ అకౌంటెంట్‌ వద్ద ఎడ్కో స్టాంపులు, సీలు
రిత్విక్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సాయిబాబా, ఎడ్కో అనే నకిలీ కంపెనీ మధ్య పలు లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. సాయిబాబా వద్ద ఎడ్కో కంపెనీకి చెందిన స్టాంపులు, స్టీలు దొరికాయని, దీన్నిబట్టి నిధులు తరలించిడానికే ఎడ్కో కంపెనీని వాడుకున్నట్లు అర్థమవుతోందని ఐటీ శాఖ తన నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో రూ.33 కోట్ల అనుమానాస్పద లావాదేవీలను కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ఇందులో రూ.25 కోట్లు కొనుగోళ్లు కోసం వెచ్చించినట్లు చూపగా అందులో రూ.23 కోట్లు నగదు రూపంలో వెనక్కి వచ్చేశాయి. ఈ లావాదేవీల గురించి ఐటీ అధికారులు కంపెనీ అకౌంటెంట్, డైరెక్టర్‌ను ప్రశ్నించగా జవాబు చెప్పలేకపోవడం గమనార్హం.

సరైన బిల్లులు లేకుండా రూ.కోట్లలో చెల్లింపులు
స్టీల్‌ సప్లయిర్స్‌ నుంచి రూ.12.24 కోట్లు వచ్చినట్లు చూపించగా దీనికి సంబంధించిన నగదు లావాదేవీలను వివరించలేకపోయారు. స్టీల్‌ సప్లయిర్స్‌ నుంచి 2 శాతం కమీషన్‌ రూపంలో మొత్తం రూ.7.98 కోట్లు వచ్చినట్లు చూపించడంపై కూడా ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీకి చెందిన సబ్‌కాంట్రాక్టర్‌ ఎన్‌కేజీ కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.6 కోట్లు చెల్లింపులు జరపగా దానికి సరైన బిల్లులు లేవు. 

స్టీలు కొనుగోలులో గోల్‌మాల్‌!
రిత్విన్‌ కంపెనీలో ఓ వ్యక్తి కంపెనీ తరుఫున రూ.2.97 కోట్లు రుణం తీసుకొని ఆ మొత్తాన్ని వ్యక్తిగత అవసరానికి వాడుకున్నట్లు గుర్తించారు. స్టీలు కొనుగోళ్లకు సంబంధించి ఆక్‌ స్టీల్స్, బీఎస్‌కే సంస్థలకు చేసిన రూ.25 కోట్ల చెల్లింపులను కూడా ఐటీ శాఖ అనుమానాస్పదమైనవిగా గుర్తించింది. ఇవి కాకుండా సోదాల్లో సీఎం రమేష్‌ ఇంటి నుంచి రూ.13 లక్షలు, రూ.2.22 లక్షల విలువైన 3,000 అమెరికన్‌ డాలర్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

అధికారులను అడగండన్న సీఎం రమేష్‌ 
సీఎం రమేష్‌ నకిలీ కంపెనీల ద్వారా నిధులను భారీఎత్తున తరలించినట్లు ఆధారాలతో సహా జాతీయ మీడియాలో ప్రధానంగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దమ్ముంటే ఒక్కటైనా అక్రమ లావాదేవీ నిర్వహించినట్లు చూపాలని మీసం మెలేసిన సీఎం రమేష్‌ను జాతీయ మీడియా ప్రతినిధులు వివరణ కోరగా ఐటీ అధికారులనే అడగాలంటూ దాటవేయడం గమనార్హం.

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ‘రిత్విక్‌’ నుంచి డబ్బులు!
సీఎం రమేష్‌ ఇంట్లో తీగ లాగితే ‘ఫిరాయింపు’ డొంక కదులుతోంది! కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డబ్బుల చెల్లింపు వ్యవహారంలోనూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ పాత్ర ఉన్నట్లు ఐటీ సోదాలతో వెలుగులోకి వస్తోంది. వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ముట్టజెప్పిన సొమ్ములో కొంత డబ్బును సీఎం రమేష్‌ కంపెనీల ద్వారా చేరవేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 

కిడారి కోసం రూ.7 కోట్లు...
సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ తదితర కంపెనీల నుంచి అడ్రస్‌లేని బోగస్‌ కంపెనీలకు రూ.వందల కోట్లలో డబ్బులు తరలించినట్లు తాజాగా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ డబ్బును ఫిరాయింపు వ్యవహారాలకు వినియోగించినట్లు భావిస్తున్నారు. ఇటీవల మావోయిస్టుల చేతుల్లో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు కూడా ఇలాగే డబ్బు అందిందనే ప్రచారం జరుగుతోంది. కిడారి పార్టీ మారిన సమయంలో విశాఖపట్నానికి చెందిన ఓ ఎమ్మెల్యే ముఖ్య అనుయాయుడి బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.7 కోట్లు జమ అయినట్లు  సమాచారం. విశాఖ ఎమ్మెల్యే ఇంటికి సమీపంలోనే ఆయన అనుయాయుడి ఇల్లు ఉంటుంది.

ఆయన విజయనగరం జిల్లాలో క్వారీ, మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారని సమాచారం. తనకు ఆడిటింగ్‌లో ఇబ్బందులు వస్తాయని అతను ఆందోళన వ్యక్తం చేయగా.. కిడారికి అందించేందుకే నీ ఖాతాలో వేశారని ఎమ్మెల్యే తన అనుయాయుడికి సర్దిచెప్పినట్లు తెలిసింది. ఫిరాయింపుదారులకు ఎరవేసిన డబ్బులు సీఎం రమేష్‌ కంపెనీల నుంచే వచ్చాయా? టీడీపీ సన్నిహితులైన వ్యాపారులు, వారితో సంబంధాలున్న వారి ఖాతాల్లోకి నిధులు చేరవేశారా? అనే కోణంలోనూ ఐటీ అధికారులు విచారణ చేపట్టినట్లు చెబుతున్నారు.   చంద్రబాబును మెప్పించేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించిన నాయకులు తాజా పరిణామాలతో బెంబేలెత్తుతున్నట్లు టీడీపీలోనే తీవ్ర చర్చ జరుగుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సొమ్ములు ఎవరి ద్వారా వెళ్లాయనే విషయాన్ని ఇన్నాళ్లూ గుట్టుగా ఉంచగలిగారని, కానీ సీఎం రమేష్‌ ఆస్తులపై జరిగిన ఐటీ సోదాలతో స్పష్టత వచ్చినట్లు అధికారపార్టీకి చెందిన నాయకులే పేర్కొంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement