
అక్రమార్కులకు చెక్‌పడేనా..?
- మార్కాపురం, గిద్దలూరు మున్సిపాలిటీల్లో సాధ్యంకాని అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ
- క్రమబద్ధీకరణకు ఈ నెల 27 చివరి తేదీ
- ఇప్పటికే మూడుసార్లు గడువు పొడిగింపు
- అయినప్పటికీ స్పందించని అక్రమార్కులు
- నోటీసుల జారీకే పరిమితమైన అధికారులు
మార్కాపురం : జిల్లాలోని మున్సిపాలిటీల్లో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ అమలవుతున్న దాఖలాలు కనిపించడంలేదు. అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు.. క్రమబద్ధీకరణకు గడువు తేదీ దగ్గరపడుతున్నప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదు. ప్రధానంగా డివిజన్ కేంద్రమైన మార్కాపురం, గిద్దలూరు మున్సిపాలిటీల్లో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ అటకెక్కింది. జూలైలో ప్రారంభమైన అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించారు. ఈ నెల 27వ తేదీతో క్రమబద్ధీకరణకు గడువు ముగియనుంది. అయినప్పటికీ అక్రమ కట్టడాల యజమానుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది.
అపరాధ రుసుంతో క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు...
పురపాలక సంఘం పరిధిలో జనవరి 1, 1985 నుంచి డిసెంబర్ 31, 2014 వరకు మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మిం చుకున్న కట్టడాలను క్రమబద్ధీకరించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందు కోసం అపరాధ రుసుం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం 100 చ.మీటర్ల వరకు వ్యక్తిగత నివాస భవనాలకు, వాణిజ్యేతర భవనాలకు చదరపు మీటర్‌కు 40 రూపాయలు, 100 నుంచి 300 చదరపు మీటర్ల వరకు రూ.60 చెల్లించాలని పేర్కొన్నారు. అతిక్రమణ 30 శాతంలోపు అయితే 300 నుంచి 500 చదరపు మీటర్లకు రూ.50 చెల్లించాలని, 30 శాతం పైన అయితే రూ.100 చెల్లించాలని పేర్కొన్నారు. పీనలైజేషన్ చార్జీల కింద రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చదరపు గజానికి రూ.25 వేలు దాటితే వందశాతం చార్జీ చెల్లించాలని పేర్కొన్నారు.
50 శాతం కూడా దాటని క్రమబద్ధీకరణ...
మార్కాపురం పట్టణంలో 187 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కానీ, ఇప్పటివరకూ 56 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిద్వారా రూ.5.60 లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది. అదే విధంగా గిద్దలూరు మున్సిపాలిటీలో 115 అక్రమ కట్టడాలున్నట్లు గుర్తించగా, 70 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. క్రమబద్ధీకరణ పూర్తిస్థాయిలో అమలైతే రెండు మున్సిపాలిటీల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.40 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ, అధికారులు కేవలం నోటీసుల జారీకే పరిమితం కావడం, తదుపరి ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో అక్రమ కట్టడాల యజమానుల్లో స్పందన లేకుండాపోయింది.
యథేచ్ఛగా అక్రమ కట్టడాలు...
మార్కాపురం పట్టణంలో 32 వార్డులు, గిద్దలూరు పట్టణంలో 20 వార్డులు ఉన్నాయి. మార్కాపురంలో మున్సిపల్ రికార్డుల ప్రకారం 17,464 కుటుంబాల వారు నివసిస్తున్నారు. 22.85 చ.కి.మీ.మేర పట్టణం విస్తరించి ఉంది. నిబంధనల ప్రకారం మార్కాపురం మున్సిపాలిటీలో జీప్లస్ వన్ భవనాన్ని నిర్మించుకునేందుకు అనుమతిస్తారు. జీ ప్లస్ 2 భవనాన్ని నిర్మించుకోవాలంటే రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా మున్సిపాలిటీకి సదరు భవనాన్ని మార్టిగేజ్ చేయాలి. 300 స్క్వేర్ మీటర్ల నుంచి 1000 స్క్వేర్ మీటర్ల వరకు నిర్మించే భవనానికి గుంటూరు రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ నుంచి అనుమతి పొందాలి. 1000 స్క్వేర్ మీటర్లు దాటితే (4 అంతస్తులపైన) హైదరాబాదులోని మున్సిపల్ డెరైక్టర్ కార్యాలయం నుంచి అనుమతులు పొందాలి. దినదినాభివృద్ధి చెందుతున్న మార్కాపురం మున్సిపాలిటీలో మూడేళ్ల నుంచి అపార్ట్‌మెంట్ నిర్మాణాలు ఊపందుకున్నాయి. వాటిలో ఎక్కువ శాతం నిబంధనలకు విరుద్ధంగా సరైన అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారు.
నోటీసులు జారీ చేశాం
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు ఈ నెల 27 వరకు ప్రభుత్వం గడువిచ్చింది. ఇప్పటి వరకు అక్రమ భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేశాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేసి క్రమబద్ధీకరించుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అందుకోసం వార్డుల వారీగా అక్రమ కట్టడాల వివరాలు సేకరిస్తున్నాం.
- వివేకానంద, టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్, మార్కాపురం మున్సిపాలిటీ