హైకోర్టు తాజా ఉత్తర్వులతో హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు కాస్త ఊరట లభించింది. గత నెల 18న ఐటీ శాఖ స్వాధీనం చేసుకొన్న హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతాలకు హైకోర్టు ఆదేశాలతో తాత్కాలికంగా విముక్తి లభించింది. దీంతో నెల రోజులుగా స్తంభించిన హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతాలన్నీ గురువారం నుంచి యథావిధిగా పని చేయడం ప్రారంభించాయి
సాక్షి, సిటీబ్యూరో:: హైకోర్టు తాజా ఉత్తర్వులతో హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు కాస్త ఊరట లభించింది. గత నెల 18న ఐటీ శాఖ స్వాధీనం చేసుకొన్న హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతాలకు హైకోర్టు ఆదేశాలతో తాత్కాలికంగా విముక్తి లభించింది. దీంతో నెల రోజులుగా స్తంభించిన హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతాలన్నీ గురువారం నుంచి యథావిధిగా పని చేయడం ప్రారంభించాయి. బిల్లుల చెల్లింపులు చకచకా జరిగిపోయాయి. ఇప్పటికే తమ వద్ద ఉన్న డీడీలను ఎన్ క్యాష్ చేసుకొనేందుకు అధికారులు వాటిని ఆయా బ్యాంకులకు పంపారు. ఆదాయార్జనకు కసరత్తు చేస్తున్నారు.
ఊతమిచ్చిన ఉత్తర్వులు
ఆదాయ పన్ను బకాయీలపై ఇన్‌కంట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు హెచ్‌ఎండీఏకు మరింత ఊతాన్నిచ్చాయి. ఈ నెల 16లోగా ఆదాయ పన్ను శాఖకు రూ.15కోట్లు చెల్లించాలని ఈ నెల 5న ఐటీ ట్రిబ్యునల్ హెచ్‌ఎండీఏను ఆదేశించింది. 21 నుంచి రెగ్యులర్ హియరింగ్ ప్రారంభమవుతుందని ఇందుకు హెచ్‌ఎండీఏ సిద్ధం కాలేకపోతే.. నెలకు రూ.10కోట్ల చొప్పున 6నెలల పాటు రూ.60 కోట్లు చెల్లించాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కలవరపడ్డ హెచ్‌ఎండీఏ గత మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో హైకోర్టు.. ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ తక్షణం రూ.10కోట్లు మాత్రం ఐటీకి చెల్లించాలని హెచ్‌ఎండీఏను ఆదేశించింది. దీంతో ఖాతాల విడుదలకు మార్గం సుగమమైంది.
స్పందించని సర్కార్
2007-08లో హెచ్‌ఎండీఏ సర్కార్ భూముల విక్రయం ద్వారా రూ.2684 కోట్లు ఆర్జించి ప్రభుత్వ ఖజానాకు జమచేసింది. ఈ ఆదాయంపై రూ.630 కోట్లు ఆదాయపన్ను చెల్లించాలని ఐటీ శాఖ హెచ్‌ఎండీఏకు నోటీసులు జా రీచేసింది. వడ్డీతో సహా మొత్తం రూ.700 కోట్లకు పైగా చెల్లించాలంటూ ఐటీ అధికారులు వత్తిడి తేవడంతో ఇప్పటికే మూడుసార్లు రూ.200 కోట్ల దాకా హెచ్‌ఎండీఏ చెల్లించింది. ఆపై చేతులెత్తేసింది. దీంతో ఐటీ అధికారులు గత నెల 18న హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి రూ.25కోట్లు స్వాధీనం చేసుకొన్నారు. దీంతో హెచ్‌ఎండీఏ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది.