గద్వాల, న్యూస్‌లైన్: ఎన్నో ఏళ్లనాటి సమస్యలవి..నేటికీ వాటికి పరిష్కారం లభించడం లేదు. ప్రజల కష్టాలకు ప్రభుత్వం స్పందించినా ఫలితం లేకుండా పోయింది. నిధులు విడుదల చేసినా అందుకుతగ్గ అనమతులు నేటికీ రాలేదు. ఓ వైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం.. మరోవైపు సమైక్య ఉద్యమం అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపింది. అధికారులు సమ్మెలో ఉండటంతో సంబంధిత ఫైళ్లకు మోక్షం కలగలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో రెండు నెలల పాటు వీటిని పట్టించుకోకపోతే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే.
సమస్యలివీ..
గద్వాల నియోజకవర్గం పరిధిలోని కృష్ణానది మధ్యలో జీవనం కొనసాగిస్తున్న ప్రజలకు బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వం 2009 జనవరిలో మంజూరు ఇచ్చింది. అయితే నేటికీ సర్వేలు పూర్తి కాలేదు. కృష్ణానది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ దీవి ప్రజలకు రవాణా కల్పించాలనే లక్ష్యంతో 2009 జనవరిలో రోప్‌వే బ్రిడ్జికి మంజూరైంది, గత ఏడాది క్రితం రోప్‌వే బ్రిడ్జి కాకుండా కాజ్‌వే బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఎలా ఉంటుందనే దానిపై సర్వేలు చేశారు. చివరకు మూడో ప్రతిపాదనగా నదిలో పిల్లర్స్‌ను ఏర్పాటు చేసి సింగిల్ లైన్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి తుది రూపు ఇచ్చారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది.
దీనికి సంబంధించిన ఫైల్ ఈఎన్‌సీ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. గద్వాల మండల పరిధిలో కృష్ణానది మధ్యలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుర్రంగడ్డ దీవి 2100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ దీవిలో దాదాపు 150 కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. కృష్ణానది నీటిని పొలాలకు తరలించి 850 ఎకరాల్లో మాగాణి పంటలను పండిస్తూ, దిగుబడిని బయటి ప్రాంతాలకు తరలించలేక వేసవి వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. మార్చిలో పేబ్బేరు వైపున నది పాయ తగ్గాక ట్రాక్టర్లలో పంట ఉత్పత్తులను గద్వాల, ఇతర ప్రాంతాల వ్యవసాయ మార్కెట్లకు తరలించి అమ్ముకుంటున్నారు.
పెండింగ్‌లో గట్టు లిఫ్టు ఫైల్...
కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టును గద్వాల డివిజన్‌లోనే నిర్మించినప్పటికీ ఈ ప్రాంతంలో కేవలం 37వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉంది. దీంతో నడిగడ్డను సస్యశ్యామలం చేసేందుకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని రెండు లక్షల ఎకరాల ఆయకట్టు సామర్థ్యంతో చేపట్టారు. ఈ పథకం ద్వారా కూడా అత్యంత వెనుకబడిన గట్టు మండల ప్రాంతానికి సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను కూడా పరిష్కరించి మరో మినీ ఎత్తిపోతల ద్వారా గట్టుకు సాగునీటిని అందించాలన్న ప్రతిపాదన మేరకు ఇప్పటికే జూరాల అదికారులు ప్రాథమిక సర్వే చేశారు. ఈ సర్వే నివేదికను ప్రభుత్వానికి గతంలో పంపారు.
ఇదీ లక్ష్యం.. ర్యాలంపాడు రిజర్వాయర్‌కు పడమర వైపున ఆలూరు గ్రామ శిశారులో రిజర్వాయర్ వద్ద ఇన్‌టేక్ వెల్‌ను నిర్మిస్తారు. అక్కడ కేవలం 0.3 మెగావాట్ విద్యుత్ వినియోగంతో నడిచే పంపింగ్ మోటారు ఏర్పాటు చేసి అక్కడి నుంచి గట్టు మండలలోని మల్లాపురం తాండ పక్కన ఉన్న గజ్జెలమ్మగుట్టపైకి నీటిని పంపింగ్ చేయాలన్నది ప్రతిపాదన. గుట్టపై నుంచి మండలంలోని చెరువులు, కుంటలకు నీళ్లు గ్రావిటిఫ్లో ద్వార వెళ్లేలా కాలువలను తవ్యుతారు. ఇలా మండలంలోని దాదాపు 30 నుంచి 40 చెరువుల కుంటలను నీటితో నింపుతారు. వీటితో పాటు లిప్టు ద్వార అదనంగా 3500 ఎకరాలకు సాగునీరు అందాలన్నది లక్ష్యం.
అనుమతి.. అదే గతి!
Published Fri, Dec 20 2013 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement