అటకెక్కిన రుణ మాఫీ! | reschedule farm loans soon, says AP govt | Sakshi
Sakshi News home page

అటకెక్కిన రుణ మాఫీ!

Published Wed, Jul 9 2014 1:16 AM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM

అటకెక్కిన రుణ మాఫీ! - Sakshi

అటకెక్కిన రుణ మాఫీ!

రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐ సూత్రప్రాయంగాఅంగీకరించింది: ఏపీ ఆర్థిక మంత్రి యనమల
రీషెడ్యూల్ ఎన్నేళ్లు, ఎవరికి వర్తిస్తుంది, ఎవరు కట్టాలి, ఎలా కట్టాలో తర్వాత ఆలోచిస్తారట!


హైదరాబాద్: వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. దాన్నిప్పుడు అటకెక్కించినట్టే కన్పిస్తోంది. మాఫీ సంగతి పక్కనపెట్టి రుణాల రీషెడ్యూల్‌మీదే దృష్టి సారిస్తోంది. పైగా దీన్నే పెద్ద ఘనతగా చూపుకునే ప్రయత్నం చేస్తోంది. నిజానికి రీషెడ్యూలు చేయడం వల్ల రైతుల రుణాలు వారి పేరుతోనే ఉంటాయి. పైగా వడ్డీ భారీగా పెరిగి తడిసి మోపెడవుతుంది. వ్యవసాయ రుణాల రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐ గవర్నర్ సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ మేరకు ఒకటీ రెండు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయని టీడీపీ ప్రభుత్వం ఏర్పడి నెల పూర్తయిన సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రీషెడ్యూల్ ఐదేళ్లా, ఏడేళ్లా, విధివిధానాలేమిటి వంటివి ఉత్తర్వుల్లో స్పష్టమవుతాయన్నారు. రీషెడ్యూల్ ఎంతమందికి వర్తిస్తుందో విధివిధానాలు వచ్చాకే చెప్తామన్నారు. రుణ మాఫీ ఎప్పుడంటే మాత్రం స్పష్టతనివ్వలేకపోయారు. ‘‘ప్రస్తుతానికి రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐ అంగీకరించింది. రీషెడ్యూల్ అవడం వల్ల రైతులకు ఈ ఖరీఫ్‌కు కొత్త రుణాలు అందుకునే అవకాశం దొరుకుతుంది. రుణమాఫీనా, రీషెడ్యూలా, ఏదైతేనేం.. రైతుల కోసం మేం అన్నిరకాలుగా ఆలోచిస్తున్నాం. తరవాత రుణ బకాయిలు ఎవరు కట్టాలో ఎలా కట్టాలో ఆలోచిస్తాం. రైతులపై మాత్రం భారం పడనీయం’’ అని చెప్పుకొచ్చారు. కౌలు రైతులకు రుణాల రీషెడ్యూల్ వర్తిస్తుందా? లేదా? కరువు, తుపాను ప్రభావిత మండలాల జాబితాలో లేని 86 మండలాలకూ రీషెడ్యూల్ వర్తిస్తుందా అని విలేకరులు ప్రశ్నించగా, ఆర్‌బీఐ రెండు రోజుల్లో విధివిధానాలు పంపిస్తుందని, దాని ప్రకారం ఎవరికి ఎలా వర్తింపచేయాలో చెప్తామని దాటవేశారు.
 
రైతుపై మరింత భారం రీషెడ్యూల్ యోచనపై బ్యాంకర్లు

హైదరాబాద్: రైతుల రుణ మాఫీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల బ్యాంకర్లు మండిపడుతున్నారు. ఎప్పటివరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారో చెప్పకుండా నాన్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫలానా తేదీవరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని, ఇప్పటికే రుణాలు కట్టిన వారుంటే వాటికి కూడా మాఫీ వర్తింపజేస్తామని జీవో జారీ చేస్తే సరిపోతుందని అంటున్నారు. ఇలా జీవో జారీ చేస్తే రైతులు చాలా మంది రుణాలను చెల్లించి, కొత్తవి తీసుకుంటారని, తరువాత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆ మొత్తాన్ని చెల్లించవచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి 31లోగానో, లేదా మరో తేదీ వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పకపోవడం వల్ల రైతులు గందరగోళానికి గురవుతున్నారని అభిప్రాయపడుతున్నారు. రుణాల రీషెడ్యూల్ వల్ల రైతులపై 12 శాతం మేరకు వడ్డీ భారం పడుతుంది తప్ప, వారికి ఊరట లభించదనే బ్యాంకర్లు అంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement