ప్రమాదం అంచున కనిగిరి రిజర్వాయర్
బుచ్చిరెడ్డిపాళెం(రూరల్), న్యూస్‌లైన్: డెల్టా ప్రాంతంలో అతి ముఖ్యమైన కనిగిరి రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉంది. 2007లో కనిగిరి రిజర్వాయర్ పటిష్టత కోసం నాటి సీఎం వైఎస్సార్ నిధులు కేటాయించినప్పటికీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పనులు ఆగిపోయాయి. తిరిగి టెండర్లు నిర్వహించకుం డా అధికారులు పనులు రద్దు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ ప్రధాన కాలువ అయిన సదరన్ చానల్ గేట్ల వద్ద కట్ట మధ్య భాగంలో పగుళ్లు ఇచ్చాయి. అలాగే సదరన్ చానల్ గేట్ల వద్ద కూడా రివిట్‌మెంట్లు, కాంక్రీట్ దిమ్మెలు దెబ్బతిని శిథిలావస్థకు చేరాయి. 2011లో సదరన్ చానల్ గేట్లు కొట్టుకుపోవడంతో రిజర్వాయర్ నీటి మట్టాన్ని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ గేట్లను ఏర్పాటు చేసేందుకు ఖర్చు చేసిన లక్షలాది రూపాయల వృథా కావడంతో పాటు రెండు టీఎంసీల నీళ్లు సముద్రం పాల య్యాయి. కొత్త గేట్ల ఏర్పాటుతోనే తమ పని అయిపోయిందన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆ గేట్ల సమీపంలోనే కాంక్రీట్, రివిట్‌మెంట్లు దెబ్బతినడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రానున్న కాలంలో భారీ వర్షాలు కురిస్తే పైపక్కనున్న కట్ట, గేట్ల వద్ద రివిట్‌మెంట్ కోతకు గురై ఎక్కడ పెను ప్రమాదం సంభవిస్తోందనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రిజర్వాయర్ కట్ట పై భాగంలో నిర్మించిన గోడలు కూడా కూలి ఉండటం నీటి పారుదల శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కనిగిరి రిజర్వాయర్‌కు ప్రమాదం సంభవించకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.