పులివెందుల, న్యూస్‌లైన్ : గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా పులివెందుల బ్రాంచ్ కాలువకు కృష్ణా జలాలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం హర్షించదగ్గ పరిణామమని, అయితే నీటి విడుదలకు ముందే సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ జిల్లా కలెక్టర్ శశిధర్‌కు ఆదివారం లేఖ రాశారు.
ఈ లేఖను కలెక్టర్‌కు ఫ్యాక్స్ చేసిన అనంతరం మీడియాకు విడుదల చేశారు. గాలేరు - నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో అంతర్భాగమైన గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా పైడిపాలెం రిజర్వాయర్‌కు నీటిని తెచ్చి అక్కడ నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 20వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలని ప్రభుత్వం సంకల్పించడం సంతోషకరమని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కలెక్టర్‌గా చేసిన కృషిని అభినందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందించి మహానేత దివంగత సీఎం వైఎస్‌ఆర్ కలను నెరవేర్చారన్నారు. ప్రభుత్వం భావిస్తున్నట్లు గండికోట ఎత్తిపోతల పథకంలో భాగంగా పైడిపాలెం రిజర్వాయర్ నుంచి పులివెందుల బ్రాంచ్ కాలువ ఆయకట్టుకు నీరు ఇవ్వాలంటే, హిమకుంట్ల చెరువు పనులు పూర్తి కావాల్సి ఉందని లేఖలో వివరించారు. ఈ విషయమై వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు, తాను పలుసార్లు సంబంధిత కాంట్రాక్టు సంస్థపైన, అధికారులపైన ఒత్తిడి తెచ్చిన విషయాన్ని వివరించారు. అయినా, పనులు పూర్తిచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు ఎత్తిపోతల పంప్ హౌస్ నిర్మాణ పనులు పూర్తి కాకుండా పీబీసీకి నీరు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చి చెప్పారు. సత్వరమే ఆ పనులను పూర్తి చేయించి పీబీసీ ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని డిమాండు చేశారు. కరువు పరిస్థితుల కారణంగా రెండేళ్లుగా పులివెందుల మునిసిపాలిటీలో తాగునీటి సమస్య తీవ్రతరమైందన్నారు. ఈ నేపథ్యంలో నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును కృష్ణా జలాలతో నింపేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను అభ్యర్థించారు.
సాంకేతిక సమస్యలు పరిష్కరించండి
Published Mon, Sep 23 2013 3:13 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement